కలం, నల్లగొండ : దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుపాకులు ఎక్కుపెట్టి, తూట్లు పొడుస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (Nalgonda Congress) అధ్యక్షులు పున్న కైలాష్ నేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర కీలక నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి గాంధీ విగ్రహం వద్ద డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల రిబ్బన్లు ధరించి శాంతియుత ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు.
నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించాలని పున్న కైలాష్ నేత అన్నారు. అలాగే దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని హెచ్చరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పరీక్షల లీకేజీల అంశంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం అణచివేయడం దురదృష్టకరమని విమర్శించారు. “కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, యువత , రైతుల పక్షాన నిలబడుతుంది. రాబోయే 2029 ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మరింత బలపరిచి తీరుతాం” అని పున్న కైలాష్ నేత చెప్పుకొచ్చారు.

