Mobile Popup Ad
Mobile Popup Ad

మీసేవ కేంద్రాల్లో అధిక చార్జీలు.. నల్లగొండ కలెక్టర్ కీలక నిర్ణయం

కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మీ-సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన యూజర్ చార్జీల ప్రకారమే ప్రజలకు సేవలు అందించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Nalgonda Collector) స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు వసూళ్లకు పాల్పడకూడదని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మీ-సేవ కేంద్రాల యజమానులు, ఆపరేటర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ (Nalgonda Collector) మాట్లాడుతూ.. మీ-సేవ ద్వారా అందించే వివిధ రకాల సేవలకు సంబంధించి ప్రభుత్వం సవరించిన చార్జీల రేట్లు వెంటనే అమల్లోకి వచ్చాయని తెలిపారు.

కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయించిన రేట్ల కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా అలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మీ-సేవకు వచ్చే దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేసేటప్పుడు ఆపరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఒక వ్యక్తికి సంబంధించిన పత్రాల స్థానంలో మరొకరి పత్రాలను అప్‌లోడ్ చేయడం లాంటి పొరపాట్లు జరగకూడదన్నారు. వివరాలను ఒకటికి రెండు, మూడు సార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నమోదు చేయాలన్నారు.

ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైనందున విద్యార్థులు ప్రవేశాలు, వివిధ సర్టిఫికెట్ల కోసం మీ-సేవ కేంద్రాలకు వస్తారని.. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా సేవలు అందించాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాల లాంటి సేవలను సులభంగా అందించేలా చూడాలన్నారు. మిర్యాలగూడ రోడ్డులోని టూ బీహెచ్‌కే కాలనీ, గొల్లగూడ ప్రాంతాల్లో కొత్త మీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి దశరథ, మీ-సేవ జిల్లా అధికారి రాజశేఖర్, ఈడీఎం దుర్గారావు, ఏపీడీ శ్రవణ్ కుమార్, మీ-సేవ జిల్లా అధ్యక్షుడు రవి, జిల్లావ్యాప్తంగా ఉన్న మీ-సేవ ఆపరేటర్లు, యాజమాన్యాలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>