Mobile Popup Ad
Mobile Popup Ad

అర్హులందరికీ పథకాల ఫలాలు చేరాలి: ఎంపీ నగేశ్

కలం, నిర్మల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణతో పనిచేయాలని ఆదిలాబాద్ ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ గోడెం నగేష్ (MP Nagesh) ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మల్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్ హాజరయ్యారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శాఖల వారీగా సమగ్రంగా సమీక్షించి, పనుల అమలులో ఎటువంటి జాప్యం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో సమాన పనిదినాలు, సమాన వేతనం అమలు చేయాలన్నారు. అనుమతులు లభించిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

‘యూరియా యాప్’పై సహాయం చేయాలి..

యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులకు యూరియా యాప్ వినియోగంపై క్షేత్రస్థాయిలో సహాయం అందించాలని పేర్కొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్నచోట పరిష్కారం చూపాలని, నిర్మాణాల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. భైంసా సమీప జాతీయ రహదారిపై ప్రమాదకర బ్లాక్‌స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, బాసర వంతెనను ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలని కోరారు.

పారదర్శకంగా అందేలా చర్యలు..

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ మ్యాప్‌లు లేని 14 గ్రామాల్లో సర్వేలు, 70 గ్రామాల్లో రీ-సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శాఖల వారీగా అధికారులు తమ పురోగతిని వివరించారు.

ఈ సమావేశంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ అంకం మౌనిక, బైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి, అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్‌వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>