కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లా బిజెపి (Nalgonda BJP) కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి పార్టీ రాష్ట్ర నేత పిల్లి రామరాజు యాదవ్ వర్గాల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. మాట మాట పెరిగి నాగం వర్షిత్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్ వర్గీయులు ఒకరినొకరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అయితే బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఒకరు నేరుగా పిల్లి రామరాజు యాదవ్ పై దాడి చేయడంతో వివాదం కాస్త ముదిరింది. ఈ వివాదాన్నంతా సీనియర్ లీడర్లు ఆపకుండా ఓ వేడుకల చూడడం గమనార్హం. నిజానికి నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన నాగం వర్షిత్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవుల మధ్య అంతర్గత పోరు గత కొంతకాలంగా కొనసాగుతూనే వస్తోంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునే నేపథ్యంలోనే ఈ పోరు కాస్త ముదిరి వివాదంగా మారింది.
నాగం వర్షిత్ రెడ్డిపై సీనియర్లంతా గుర్రు..
నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి బిజెపిలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడంపై సీనియర్లంతా అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాతి నుంచి నాగం వర్షిత్ రెడ్డి.. సీనియర్లందరినీ పక్కనపెట్టి ఒంటెద్దు పోకడ నిర్ణయాలను తీసుకుంటున్నారని అడపాదడపా అంతర్గత కలహాలు బయటపడుతూనే ఉన్నాయి. కనీసం పార్టీ కార్యక్రమాల్లోనూ పార్టీ సీనియర్లకు ప్రయారిటీ ఇవ్వకపోవడం.. క్యాడర్ ను డెవలప్ చేయడం కంటే ఓన్ ఇమేజ్ ను పెంచుకోవడంలో వర్షిత్ రెడ్డి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శలు వెళ్లివేత్తాయి. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వచ్చిన పిల్లి రామరాజు యాదవ్ సైతం జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించడం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే నాగం, పిల్లి వర్గాలుగా పార్టీ కేడర్ చీలిపోయింది. ఇదిలా ఉంటే పార్టీలోని సీనియర్లందరూ ఈ వర్గ పోరును లైట్ తీసుకొని.. వేడుకగా చూడడం మొదలుపెట్టారు. ఆ వర్గ పోరు కాస్త ముదిరిపాకన పడింది. ఫలితంగా ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయంలోనే ఒకరినొకరు కొట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నాగం వర్షిత్ రెడ్డి సంగతి వదిలేది లేదని, అసలు లెక్కేంటో తేల్చాలని పిల్లి రామరాజు యాదవ్ పట్టుబట్టి కూర్చున్నారు. బిజెపి సీనియర్ లీడర్లు పిల్లి రామరాజు యాదవ్ ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
బిజెపి కార్యాలయంలో ఉద్రిక్తత..
ఈ క్రమంలోనే Nalgonda BJP కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓవైపు నాగం, పిల్లి వర్గీయులు పార్టీ కార్యాలయంలో కొట్టుకోగా.. ఆ దృశ్యాలను చిత్రీకరించిన మీడియాపై నాగం వర్షిత్ రెడ్డి దాడి చేశారు. కెమెరాలను లాక్కుని మెమరీ కార్డులను పూర్తిగా ఫార్మాట్ చేశారు. దీంతో మీడియా మిత్రులు బీజేపీ ఆఫీసు ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. నాగం వర్షిత్ రెడ్డి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ దాదాపు రెండు గంటలపాటు నిరసనకు దిగారు.


