కలం, ఖమ్మం బ్యూరో : పట్టణ ప్రాంతాలలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మక “నక్షా” (NAKSHA) ప్రాజెక్ట్ మణుగూరు (Manuguru) లో నత్తనడకన సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మున్సిపాలిటీ ఈ ప్రాజెక్ట్‌కు పైలట్‌గా ఎంపికైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న ఈ డిజిటల్ సర్వేలో డ్రోన్ సాయంతో ఏరియల్ ఫోటోగ్రఫీ పూర్తయింది. అయితే భూముల అసలు సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ తీవ్రంగా మందగించింది. దీనికి ప్రధాన కారణం లైసెన్స్‌డ్ సర్వేయర్లకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడమేనని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సర్వేయర్లు విధులకు దూరంగా ఉండటంతో సిబ్బంది కొరత ఏర్పడి, సర్వే పనులు దాదాపు నిలిచిపోయాయి.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే పట్టణంలోని బస్తీలు, కాలనీలు, మురికివాడలలో పత్రాలు లేని ఇళ్లకు డిజిటల్ ప్రాపర్టీ కార్డులు అందించే అవకాశం ఉంది. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఆస్తుల గుర్తింపు జరగడంతో భూముల విలువ పెరగడమే కాకుండా, బ్యాంకు రుణాలు పొందే వీలుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ భూములు, చెరువులు, డ్రైనేజీలు, ఆక్రమణలు అన్నీ స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం పనులు నిలిచిపోవడంతో ప్రజలు ఈ ప్రయోజనాలను కోల్పోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 7,524 ఆస్తులలో 5,064 ఆస్తుల సర్వే పూర్తయిందని చెబుతున్నప్పటికీ, మిగిలిన సర్వే, డిజిటలైజేషన్ ప్రక్రియ గణనీయంగా పెండింగ్‌లో ఉంది.
నక్షా (NAKSHA) సర్వే నోడల్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, సర్వేయర్లు ల్యాండ్ అక్విజిషన్ పనులలో నిమగ్నమవడం, వేతనాలు పెండింగ్‌లో ఉండటం వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కారం చూపించి సర్వే పనులను పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టి, సర్వేయర్ల వేతనాలను వెంటనే చెల్లించి, ఈ కీలక ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ మణుగూరులో మూలనపడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం : మంత్రి తుమ్మల
Follow Us On: Instagram

