కలం, నల్లగొండ బ్యూరో : ఫస్ట్ ఫేజ్ స్థానిక సంస్థల (Local Body Elections) ఎన్నికల్లో రిగ్గింగ్ (Rigging) చేసి కాంగ్రెస్ గెలిచిదంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) చేసిన కామెంట్లపై నకిరేకల్ (Nakrekal) ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోలింట్ కేంద్రంలో బీఆర్ఎస్ ఏజెంట్లు ఉండగా రిగ్గింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పదేండ్లు మంత్రిగా పనిచేసినోడికి రిగ్గింగ్ గురించి కనీస అవగాహన కూడా ఉండదా?.. ఇదేనా ఆయనకున్న ఇంగిత జ్ఞానం?.. మంత్రిగా ఉండి కూడా పదేండ్లు నియోజకవర్గాన్ని, జిల్లాను అభివృద్ధి చేసుకోలేకపోయిన ఆయన ఇప్పుడు ఆడలేక మద్దెల.. సామెత తరహాలో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ తీరు ఇట్లనే కొనసాగితే ఈ జిల్లాలో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని, ఆయన వెంట ఉండే కార్యకర్తలు కూడా మిగలరని హెచ్చరించారు. ఇప్పటికైనా అహంకారాన్ని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు.
ఏజెంట్లు ఉండగా రిగ్గింగ్ జరుగుతుందా?
ప్రజల ఆదరణను కోల్పోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు అదే తీరులో బుద్ధి చెప్పారని వేముల వీరేశం అన్నారు. చినకాపర్తి గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలవడాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లు రిగ్గింగ్ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ ఏజెంట్లు సైలెంట్‌గా ఉంటారా?.. పోలింగ్ ఆఫీసర్లు ప్రేక్షకులుగా ఉండిపోతారా?.. ఓటరు స్లిప్‌లపై వారి సంతకాలతో పాటు పోలింగ్ సిబ్బంది సంతకాలు ఉంటాయనేది కూడా మంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డికి (Jagadish Reddy) తెలియదా?.. అని నిలదీశారు. బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ సమయంలోనూ బీఆర్ఎస్ ఏజెంట్లు ఉంటారని, వారిని అడిగితే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలుస్తుందన్నారు. పోలింగ్ ఆఫీసర్లను మేనేజ్ చేశారు.. అంటూ ఆయన కామెంట్ చేయడం ప్రభుత్వ సిబ్బందిని అవమానించడమేనని అన్నారు.
చర్యలు తీసుకోవాలని కోరిందే మేము :
కౌంటింగ్ సెంటర్‌లో అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని, లెక్కించిన ఓట్లను, పోల్ అయిన ఓట్లను పోలింగ్ సిబ్బంది టాలీ చేస్తారని వేముల వీరేశం (Vemula Veeresham) గుర్తుచేశారు. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి 400 మెజార్టీతో గెలుపొందాడని, ఇంత భారీ మెజారిటీ రావడాన్ని తట్టుకోలేకనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసిన బ్యాలట్ బాక్సుల్లో బ్యాలట్ పేపర్లు మిస్ అయిన ఘటనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలింగ్ అధికారులను కోరిందే తాము అని గుర్తుచేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినందునే జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఆదేశించిందని గుర్తుచేశారు. పోలింగ్ ప్రక్రియపై అభ్యర్థులు సైతం ఎలాంటి అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. మంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డి జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, చివరకు డిండి, బ్రాహ్మణవెల్లంల, అయిటిపాముల లిఫ్ట్ ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేయలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాల్వ, వంద పడకల ఆస్పత్రి సాకారమయ్యాయని, వాటిని ఓసారి వచ్చి చూడాలని సూచించారు.
Read Also: మెస్సీ పక్కన రాహుల్, రేవంత్ ప్లేస్ డిసైడ్ చేసేదెవరు?
Follow Us On: Youtube


