కలం, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ (Nagarkurnool ) నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పలు అంశాలపై అధికార పార్టీని నిలదీశారు.
ప్రతిపక్ష నాయకులు శాంతియుతంగా నిరసనలు, ప్రజా సమస్యలపై కార్యక్రమాలు నిర్వహిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల పట్ల పోలీసులు సమానంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌కు జిల్లా హోదా, ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజీ వంటి ముఖ్యమైన సంస్థలు, అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే సాధ్యమయ్యాయని తెలిపారు.
గగ్గలపల్లి రెవెన్యూ శివారులో భూముల కొనుగోలు వ్యవహారాలు, తెల్కపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రజాక్షేత్రంలో చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. దమ్ముంటే ఎమ్మెల్యే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, అతినరపు విష్ణు, జోగు ప్రదీప్, మాజీ మార్కెట్ చైర్మన్ నల్లగంటి వెంకటయ్య, ఆకునెల్లికుదురు సర్పంచ్ బాల వెంకటయ్య, మాజీ సర్పంచులు బొడ్డు వెంకట రమణ, రామకృష్ణ రెడ్డి, వేణుగోపాల్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఐతొల్ లక్ష్మయ్య, నగేష్ చారి, ఆలూరి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

