డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు : తిమ్మాజిపేట్ పాండు

కలం, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత లోపించిందని బీఆర్ఎస్ (Nagarkurnool BRS) కౌన్సిలర్ తిమ్మాజిపేట్ పాండు ఆరోపించారు. అసంపూర్తి ఇళ్లను హడావుడిగా కేటాయించడం సరికాదని, ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ కౌన్సిలర్ నాయకులు పేదల నుంచి డబ్బులు వసూలు చేశారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పాండు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను మూడేళ్లుగా పెండింగ్ లో ఉంచారన్నారు.

ఇప్పుడు కనీస మౌలిక సదుపాయాలు లేకుండానే 192 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇళ్లకు తలుపులు, కిటికీలు లేవని, విద్యుత్, డ్రైనేజీ, పెయింటింగ్ పనులు కూడా పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు. ఇలాంటి అసంపూర్తి ఇళ్లను ఇచ్చి, మిగిలిన పనులు లబ్ధిదారులే చేసుకోవాలని అధికారులు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో, ఎవరు పరిశీలించారో ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్​ చేశారు. అర్హులైన పేదలకు కాకుండా ఆర్థిక స్థోమత ఉన్నవారికి ఇళ్లు కేటాయించారని ఆరోపించారు.

కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపించాలని పాండు డిమాండ్ చేశారు. అలాగే ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, అభిప్రాయం చెప్పబోయిన ప్రజాప్రతినిధులను పోలీసులతో అరెస్టు చేయించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు జేపీ చారి, కొత్త గంగాధర్, నాయకులు భాస్కర్ గౌడ్, ముమ్మడి నగేష్ చారి, నక్క జానకి రాములు యాదవ్, వెంకటేష్, గోపాల్, సురేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>