కలం, కరీంనగర్: జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన 30 మంది రక్తదాతలను ఘనంగా సన్మానించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ రాపోలు గోపికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అత్యవసర పరిస్థితులలో నిస్వార్థంగా ఎక్కువ సార్లు రక్తదానం చేసిన దాతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా ‘ఆసరా ప్రాణదాత – 2026’ జిల్లాస్థాయి అవార్డులను ప్రధానం చేసి సత్కరించారు. రక్తదాతలను బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించడంతో పాటు, సమాజంలో ఆసరా ఫౌండేషన్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి గొల్లె తిరుపతి, సభ్యులు ఎం. రవిచందర్, ఎస్. నిఖిల్, పి. సంతోష్, ఎస్. అద్వైత్ తదితరులు పాల్గొన్నారు.

