కలం వెబ్ డెస్క్ : హీరోయిన్ల వస్త్రధారణపై ఇటీవల నటుడు శివాజీ(Shivaji) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. స్త్రీల వస్త్రధారణ(womens dressing)పై సర్వత్రా తీవ్ర చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా(social media) వేదికగా పలువురు సెలబ్రెటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై ఇప్పటికే నటుడు శివాజీకి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నేడు ఆయన మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ తరుణంలో సినీ, రాజకీయ ప్రముఖుడు, మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ఆడపిల్లల వస్త్రధారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లల వస్త్రధారణ అనేది వారి వ్యక్తిగతం అని, వారు ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. నాగబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మన పురుషాధిక్య సమాజంలో ఏళ్ల తరబడి ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం ధరించాలి.. అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారన్నారు. ఇది రాజ్యాంగానికే వ్యతిరేకమన్నారు. ఆడపిల్ల వస్త్రధారణ నిర్ణయించడానికి మీకు ఏం హక్కు ఉంది అని ప్రశ్నించారు. మగవాడు కాబట్టి ఏదైనా మాట్లాడుతారా అని నిలదీశారు. ఒకప్పుడు తాను కూడా అలాంటి ఆలోచనా విధానంతోనే ఉండేవాడినని, ఇప్పుడు మార్చుకున్నానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లలపై జరిగే దాడులు వారు వేసుకునే వస్త్రధారణ కారణంగా జరగడం లేదన్నారు. మగవాడిలో క్రూరత్వానికి ఆడపిల్లలు బలైపోతున్నారు కానీ దుస్తులు కారణం కాదని స్పష్టం చేశారు. రక్షణ అనేది ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్నారు. ఆడపిల్లలు ఎంత స్వేచ్ఛగా అయినా ఉండవచ్చని, ఎలాంటి దుస్తులు అయినా ధరించ వచ్చని చెప్పారు. బయటకు వెళ్తున్నప్పుడు రక్షణ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవసరమైతే ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలన్నారు. సమాజంలో కొందరు దుర్మార్గులైన మగవాళ్లున్నారన్నారు. చిన్నపెద్ద తేడా లేకుండా అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలు మోడ్రన్ దుస్తులు వేసుకుంటే తప్పు కాదని, వారికి రక్షణ కల్పించలేకపోతే ప్రభుత్వానిదే వైఫల్యం అని పేర్కొన్నారు. నాగబాబు తాను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదని స్పష్టం చేసినా శివాజీ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించినట్లు తెలుస్తోంది. స్త్రీల వస్త్రధారణపై ఒక్కో సెలబ్రెటీ ఒక్కో తీరుగా స్పందిస్తున్న వేళ నాగబాబు వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.


