కలం, నిర్మల్: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా (Nirmal ) కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ.. దివ్యాంగులు తమ సొంత కాళ్ల మీద నిలబడేలా ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుందని అన్నారు.
దివ్యాంగుల కొరకు రాష్ట్రంలో ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిందన్నారు. 11 వేల దివ్యాంగ పొదుపు సంఘాల్లో దాదాపు 80 వేల మంది దివ్యాంగులు లబ్ధిపొందుతుందన్నారు. దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ విషయంలో ఉన్న కఠిన నిబంధనలు సవరించామని, దీని ద్వారా ఎక్కువ మంది దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఆరు సంవత్సరాల లోపు దివ్యాంగుల ఆరోగ్యం మెరుగు కోసం బాల భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

