epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ.. తెరిచేదెన్నడు..?

కలం, కరీంనగర్ బ్యూరో : జగిత్యా జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ (Muthyampet Sugar Factory)పై మళ్లీ చర్చ జరుగుతోంది. బీఆర్ ఎస్ హయాంలో మూతపడ్డ ఈ షుగర్ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన వెంటనే తెరిపిస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కో అడుగు ముందుకు పడుతుంటే ఫ్యాక్టరీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు. అయితే గడిచిన ఏడాది కాలంగా పరిశ్రమ విషయం పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

నిజాం దక్కన్ ఘుగర్స్ లిమిటెడ్ పేరుతో సుమారుగా 500ఎకరాల్లో 1959లో ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఈ షుగర్ ఫ్యాక్టరీ స్థానిక రైతులకు అనేక రకాలుగా ఉపయోగపడింది. రైతులు పండించిన చెరుకు అమ్మకాలకు ఇబ్బంది లేకుండా పోయింది. కానీ కాల క్రమంలో షుగర్ ఫ్యాక్టరీ నష్టాల బాటపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీని డెల్టా పేపర్ మిల్లుకు 51 శాతం, నిజాం షుగర్స్(Nizam Sugars) కు 49 శాతం వాటా ఒప్పందం చేసి కొనసాగించారు. నిజాం దక్కన్ షుగర్స్ (ఎన్ఎస్డీఎల్) పరిధిలోని నిజామాబాద్ జిల్లాలోని బోధన్, మెదక్ జిల్లాలోని మంబోజీపల్లితో పాటు ఈ ముత్యంపేట ఫ్యాక్టరీలను ప్రైవేటికరణ చేశారు. 2004లో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక విచారణ సైతం జరిపించారు.

బీఆర్ఎస్ హాయంలో మూత..

ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ పరం అయిన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ (Muthyampet Sugar Factory)ని 100రోజుల్లో స్వాధీనం చేసుకొని తెరిపిస్తామని 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ హమీ ఇచ్చారు. కానీ అదే 2014 డిసెంబర్ లో ఈ ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడింది.

కాంగ్రెస్ ఎన్నికల హమీ..

2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సర్కారు వస్తే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. గతంలో దివాళా కంపెనీగా ఎన్ఎస్డీఎల్ ను ప్రకటిస్తూ లిక్విడేట్ చేయాలని నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ ఆదేశించింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా ఊరట లభించింది. గతంలో తీసుకున్న రూ.190 కోట్ల రుణాన్ని నాలుగు విడతలుగా ప్రస్తుత ప్రభుత్వం చెల్లించింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం 2024 జనవరి 12నే మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో మరో మంత్రి దామోదర్ రాజనర్సింహ వైస్ చైర్మన్ గా ఎనిమిది మందితో కమిటీ వేశారు. కమిటీకి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వడంతో క్యాబినెట్ ఎన్ఎస్డీఎల్ పునరుద్ధరణకు పచ్చజెండా ఊపింది.

ప్రారంభమైతే రైతులకు మేలు..

ఫ్యాక్టరీ తెరిపిస్తే మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి, కోరుట్ల మేడిపల్లి, జగిత్యాల, బుగ్గారం మండలాల్లో పలువురు రైతులు చెరుకు పంట పండిస్తారు. ముత్యంపేట ఫ్యాక్టరీ మూతపడటంతో కామారెడ్డి జిల్లా బోధన్ కు చెరుకు తరలించడానికి రైతులకు రవాణ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో లక్ష టన్నుల చెరుకు పండిస్తున్నారు కాబట్టి ఈ ఫ్యాక్టరీ తెరిపిస్తే వేల మందికి లాభం జరుగుతుందని అంటున్నారు. కానీ కొంత కాలంగా ఫ్యాక్టరీ విషయం పట్టించుకోకపోవడంతో అసలు ఎప్పుడు తెరుస్తారో అనే క్లారిటీ లేక రైతులు అందోళన చెందుతున్నారు.

Read Also: రూ.2 లక్షలు క్రాప్ లోన్ కట్టిన రైతు.. అన్నీ నకలీ నోట్లే !

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>