మునుగోడులో గొర్రెల పథకం లబ్ధిదారుల గోస

కలం, నల్లగొండ బ్యూరో :  మునుగోడు (Munugode) నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ పథకం(Sheep Distribution Scheme) లబ్ధిదారుల సమస్యలు తీవ్ర ఆవేదనకు దారితీస్తున్నాయి. మునుగోడుకు చెందిన రమేష్ యాదవ్  2022లో గొర్రెల పథకం కోసం తన వాటా ధనం చెల్లించినప్పటికీ ఇప్పటికీ గొర్రెలు అందలేదు. అంతేకాకుండా ఆయన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయడంతో తన సొంత డబ్బును కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నాడు. ఈ ఒక్క కేసు మాత్రమే కాకుండా మునుగోడు (Munugode) నియోజకవర్గంలో సుమారు 300 మంది గొల్లకురుమలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. ఉపఎన్నికల సమయంలో ప్రారంభమైన గొర్రెల పంపిణీ హామీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలుకాలేదని వారు ఆరోపిస్తున్నారు.

ప్రతి లబ్ధిదారుడు రూ.43,750 వాటా ధనం చెల్లించినప్పటికీ నాలుగేళ్లుగా గొర్రెలు అందలేదని పేర్కొన్నారు. సబ్సిడీ డబ్బులు డ్రా చేయకుండా ఉండేందుకు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో తమ వ్యక్తిగత పొదుపు సొమ్మును కూడా వాడుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అప్పట్లో సబ్సిడీగా ఒక్కో లబ్ధిదారుని ఖాతాలో రూ.1,58,000 జమ చేసినప్పటికీ, కొందరు డబ్బులు తీసుకుంటున్నారనే కారణంతో ఖాతాలు ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంతో అవసరానికి డబ్బులు తీసుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బాధితులు.. అధికారులు, కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ‘అక్కడ అడగండి’ అనే సమాధానమే వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నేతృత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిని కలిసి సమస్యను పరిష్కరించాలని కోరినప్పటికీ స్పందన రాలేదని చెబుతున్నారు. అధికారులు మాత్రం సబ్సిడీ మొత్తానికి మాత్రమే పరిమిత ఫ్రీజింగ్ ఉందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మొత్తం ఖాతా నిలిపివేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖాతాల ఫ్రీజింగ్ ఎత్తివేసి, వాటా ధనం చెల్లించిన వారికి వెంటనే గొర్రెల పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>