యూటర్నా.. కేబినెట్ బెర్తా.. మునుగోడు ఎమ్మెల్యే రూటెటూ?

కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో.. ఏ క్షణంలో ఎలాంటి బాంబు పేలుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) వైఖరి సొంత పార్టీలోనే కాక.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కొద్దిరోజుల కిందటే అధిష్టానం వద్ద అంతా కూల్ అయిందని భావించే లోపే.. తాజాగా ఆయన వలస ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మరోవైపు సొంత అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో బంధాలపై ఇచ్చిన స్టేట్‌మెంట్లు గులాబీ గూటి నుంచి హస్తం పార్టీలోకి వచ్చిన నేతలతో పాటు కేడర్‌లోనూ కలకలం రేపాయి. అసలు రాజగోపాల్ రెడ్డి పదే పదే స్వరం మార్చడం వెనుకున్న ఏకైక లక్ష్యం కేబినెట్ బెర్తేనా? మంత్రి పదవి దక్కించుకునే పంతంతోనే ఆయన పొలిటికల్ గేమ్‌కు తెరలేపారా?.. అనే ప్రశ్నలు తలెత్తగా.. అసలు ఉమ్మడి జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు, క్యాడర్ గానీ రాజగోపాల్ రెడ్డికి కనీస మద్దతు తెలపకపోవడం గమనార్హం. మంత్రి పదవి కోసం ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారనే చెప్పాలి.

వలస నేతల పెత్తనం పెరిగిందని..

కొద్దిరోజుల కిందటివరకు అధిష్టానంపై, రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy).. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, అగ్రనేత రాహుల్ గాంధీ పట్ల సానుకూలంగా మాట్లాడారు. దీంతో పార్టీ శ్రేణులంతా ఆయన రూట్ క్లియర్ అయిందని, సర్దుకుపోయారని భావించారు. కానీ, అంతలోనే సీన్ రివర్స్ అయింది. మళ్లీ తనదైన శైలిలో అసంతృప్తి గళాన్ని విప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వలస ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతోందంటూ పరోక్షంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.

ఆయన కుటుంబం.. నాది ఒక్కటి కాదు

రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు సొంత అన్న, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులను సైతం విస్మయానికి గురిచేశాయి. “ ఆయన కుటుంబం వేరు.. నా కుటుంబం వేరు. వెంకటరెడ్డి నా కుటుంబం కాదు” అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నకు మంత్రి పదవి ఉండగా.. మళ్లీ ఒకే కుటుంబానికి ఇంకో పదవి ఇవ్వడం కుదరదనే విషయం తెరపైకి రాకుండా ఉండేందుకే.. రాజగోపాల్ రెడ్డి తన అన్నను పరాయి వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆయనకు పార్టీ లైన్‌ దాటి మాట్లాడటం కొత్తేమీ కాదు. గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉంటూనే మోదీ నాయకత్వాన్ని పొగిడారు. ఆ తర్వాత రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారు. బై పోల్ వచ్చేలా వ్యవహరించారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ గూటిలో చేరారు. ఇలా ఆయన పొలిటికల్ గ్రాఫ్ అంతా యూటర్న్‌లతోనే నడిచింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. తనకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉన్నట్టు నటిస్తూనే మరోవైపు జిల్లాలో తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు వలస నేతలపై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వైఖరి కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన అసంతృప్తిని చల్లార్చడానికి మంత్రి పదవి ఇస్తారా? లేక జిల్లా సమీకరణాల దృష్ట్యా లైట్ తీసుకుంటారా? అనేది చూడాలి. ఏదేమైనా మంత్రి పదవి దక్కే వరకు తన రూట్ మారేలా లేరని ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది.

Read Also: సీజేపీ ఆందోళ‌న‌లు.. అమిత్ షాతో ధ‌ర్మేంద్ర భేటీ!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>