కలం, నిజామాబాద్ బ్యూరో : వానమ్మ కోసం అంతా ఒక్కటయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో వర్షాల (Rain) కోసం దేవుళ్ళను వేడుకుంటున్నారు. మగవారు జలాభిషేకాలు చేస్తున్నారు. ఊరూరా బోనాలతో మహిళలు పూజలు చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో వరుణుడు ముఖం చాటేశాడు. అడపా దడపా వర్షాలు కురుస్తున్నా లోటు కిందనే ఉంటోంది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల నాట్లు కూడా పడలేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. గ్రామాల్లోని జనాలు దేవుళ్ళ పైనే భారం వేశారు.
లింగాలకు జలాభిషేకం
కామారెడ్డి జిల్లా గాంధారి (Gandhari) మండలం తిమ్మాపూర్ లో మగవారు వినూత్నంగా పూజలు చేశారు. వరుణుడు కరుణించి పంటలు పండేలా చూడాలని కోరుతూ ఊరిలోని మగవారంతా ఏకమయ్యారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒక మగ వ్యక్తి నీటి బిందెతో తరలివచ్చారు. భక్తి పాటలు పాడుతూ గ్రామ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. స్థానిక ఆలయాల్లో శివలింగాలకు, హనుమాన్ విగ్రహాలకు మహా జలాభిషేకాలు నిర్వహించారు.
వరుణ దేవుడా.. కరుణించి వానలు కురిపించూ అంటూ మొరపెట్టుకున్నారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మపూర్ లో దేవుళ్లకు జలాభిషేకం చేశారు. తిమ్మారెడ్డి తండా ప్రజలు శివారులో శివుని విగ్రహానికి నీళ్లాభిషేకం చేశారు. ఎల్లారెడ్డిలోని ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రత్యేక సలాతుల్ ఇస్తిస్కా(వర్ష ప్రార్థన) నిర్వహించారు. నమాజ్ అనంతరం అల్లాహ్‌ను వేడుకుంటూ సమృద్ధిగా వర్షాలు కురవాలని దువా చేశారు.
ఊరూరా బోనాలు
ఉమ్మడి జిల్లాలోని (Nizamabad) గ్రామాలు, పట్టణాల్లో బోనాలను తీశారు. అమ్మవార్లకు సమర్పించారు. బాన్సువాడ సంగమేశ్వర కాలనీ జోడ్ కనకదుర్గా దేవి మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి స్వయంగా బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొని, అనంతరం దుర్గా మాత గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో జీవించేలా చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు పోచారం తెలిపారు.
గోదావరి నీళ్లతో చిమ్రాజ్ పల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. నిజామాబాబ్ జిల్లా బడా భీం గల్ లో మహిళలు పాటలు పాడుతూ దేవుళ్లను వేడుకున్నారు. ఇలా గ్రామాలు, పట్టణాల్లో బోనాలు తీసి, అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకుని, వర్షాలు కురిపించి ఆదుకోవాలని వేడుకున్నారు.
Read Also: పార్లమెంట్ సమావేశాల వేళ ‘రాహుల్ వీడియో’ కలకలం!
Follow Us On : WhatsApp

