epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా వర్సిటీలు వెలవెల

కలం, తెలంగాణ బ్యూరో: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశంలోని యూనివర్సిటీల్లో (US Universities) విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. అక్కడ అడ్మిషన్లు తీసుకోవాలంటేనే ఫారిన్ స్టూడెంట్లు జంకుతున్నారు. లక్షలకు లక్షలు తగిలేసి అక్కడి యూనివర్సిటీల్లో చేరి అనవసర చిక్కులు కొని తెచ్చుకోవడం ఎందుకని వెనుకడుగు వేస్తున్నారు. ట్రంప్ (Donald Trump) ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తారో అర్థం కావడం లేదని, ఈ గందరగోళ పరిస్థితుల్లో అమెరికా వెళ్లి చదువుకుంటే వచ్చేది మెంటల్ టెన్షన్ తప్ప, మరోటి కాదని భావిస్తున్నారు. ఇలా ఏడాది కాలంలోనే అమెరికాలో 6 శాతం (దాదాపు 10 వేల మంది) వరకు విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గిపోయాయి. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. ఈ విషయం నేషనల్ స్టూడెంట్ క్లియరింగ్ హౌస్ రీసెర్చ్ సెంటర్ స్టడీలో వెల్లడైంది. మూడేండ్లలో ఈ స్థాయిలో ఫారిన్ స్టూడెంట్లు తగ్గడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. అయితే.. లోకల్ స్టూడెంట్ల సంఖ్య మాత్రం ఒక్క శాతం పెరిగినట్లు తేలింది.

స్ట్రిక్ట్ రూల్సే కారణం

2025 జనవరిలో రెండో సారి అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూనివర్సిటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇమిగ్రేషన్, వీసా రూల్స్ ను రోజు రోజుకు కఠినతరం చేస్తున్నారు. వర్సిటీల్లో కొన్ని దేశాల విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో పలు వర్సిటీలకు రాయితీలను కూడా కట్ చేశారు. ముఖ్యంగా చైనా వంటి దేశాల నుంచి వచ్చే విద్యార్థులకు బ్రేక్ వేసేలా చర్యలకు దిగారు. అమెరికా భద్రతే లక్ష్యంగా 8వేల మంది స్టూడెంట్ల వీసాలను రద్దు చేసినట్లు ఇటీవల ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.

వర్సిటీలకు ఆర్థిక కష్టాలు

అమెరికాలోని యూనివర్సిటీల్లో (US Universities) ఫారిన్ స్టూడెంట్ల అడ్మిషన్లు తగ్గిపోవడంతో ఆ వర్సిటీలకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. సాధారణంగా విదేశీ స్టూడెంట్లు పూర్తి ఫీజును చెల్లిస్తుంటారు. దీంతో విశ్వవిద్యాలయాలకు ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. చికాగోలోని లూయిస్ యూనివర్సిటీలో విదేశీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ల సంఖ్య 37 శాతం తగ్గింది. దీంతో ఆదాయ మార్గం లేక.. ఆ వర్సిటీ తన స్టాఫ్ లో 10 శాతం మందిని తొలగించింది. 2024తో పోలిస్తే.. అమెరికాలో గ్రాడ్యుయేషన్ లో చేరే విదేశీ విద్యార్థుల సంఖ్య 2025లో దాదాపు 6 శాతం తగ్గిందని క్లియరింగ్ హౌస్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ డైరెక్టర్ మ్యాథ్యూ పేర్కొన్నారు.

హార్వర్డ్ వర్సిటీ తీరు అలగ్

మొదటి నుంచీ హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) పై ట్రంప్ నిప్పులు చెరుగుతున్నారు. ఈ వర్సిటీ అడ్డాగా విదేశీ విద్యార్థులు దేశంలో అశాంతికి కారణమవుతున్నారని, అమెరికాకు డిజాస్టర్ గా ఇది పరిణమించిందని వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఫారిన్ స్టూడెంట్లను వెనక్కి పంపాలటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే.. ట్రంప్ హెచ్చరికలు ఇక్కడ పనిచేయడం లేదు. ఇది టాప్ యూనివర్సిటీ కావడంతో ఇక్కడ కొత్తగా చేరే ఫారిన్ స్టూడెంట్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2025 అకడమిక్ ఇయర్ లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న మొత్తం విద్యార్థుల్లో 28 శాతం మంది విదేశీయులే కావడం గమనార్హం.

మారుతున్న స్టూడెంట్స్ మైండ్ సెట్

అమెరికాలో చదివితేనే భవిష్యత్తు అనే భావనలో ఇన్నాళ్లూ ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇప్పుడు మార్పు వస్తున్నది. ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్ల మైండ్ సెట్ లో ఈ చేంజెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చదువు కోసం అమెరికానే వెళ్లాల్సిన అవసరం లేదని, వెళ్తే మాత్రం అక్కడి టాప్ యూనివర్సిటీల్లోనే చేరాలని భారతీయ విద్యార్థులు భావిస్తున్నారు. చదువు కోవడానికి మన దగ్గరే చాలా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. యూఎస్ కు వెళ్లి లక్షలకు లక్షలు ఖర్చు చేసే బదులు ఇండియాలోనే మంచి యూనివర్సిటీలో సీటు సాధించాలని ప్రిపేర్ అవుతున్నారు. కొందరు యూకే, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని వర్సిటీల వైపు చూస్తున్నారు.

Read Also: ఇంటర్​ విద్యార్థులకు సూపర్​ ఆఫర్​.. రూ.లక్ష జీతంతో నేవీలో ఉద్యోగాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>