కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి అధ్యక్షతన మేడారంలో జరిగే మంత్రివర్గ సమావేశంపైనే ఆసక్తికర చర్చ జరుగుతున్నది. అక్కడ నిర్వహించడంలోని ఆంతర్యమేంటో అధికారులకూ అంతుపట్టడంలేదు. ఈ క్యాబినెట్ భేటీలో (Telangana Cabinet Meeting) దాదాపు 15 అంశాలు చర్చకు రానున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఇందులో రెవెన్యూ శాఖకు చెందినవి 5, మునిసిపల్ శాఖ తరఫున 2, ఆర్థికశాఖ నుంచి 3, ఇరిగేషన్ శాఖ నుంచి మరికొన్ని అంశాలు ఎజెండాలో ఉన్నట్లు తెలిసింది. ఈ అంశాలకు బ్యాక్‌గ్రౌండ్‌గా ఉండే సమాచారాన్ని అధికారులు వారి వెంట తీసుకెళ్తున్నారు. క్యాబినెట్ భేటీ కోసం వివిధ స్థాయిల్లోని సుమారు 300 మంది అధికారులు మేడారం వెళ్తున్నారు. ఇవి కాక దావోస్ ట్రిప్, రైతుభరోసా నిధుల విడుదల తదితరాలపైనా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికలు, చట్ట సవరణపై :
క్యాబినెట్ భేటీలో (Telangana Cabinet Meeting) రెవెన్యూ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్, ఫైనాన్స్ తదితర పలు శాఖల అంశాలపై చర్చ జరగనున్నది. రెవెన్యూ శాఖ నుంచి వచ్చే ఫైళ్లలో భూ కేటాయింపులకు చెందినవి ఉన్నట్లు తెలిసింది. ఆర్థికశాఖ నుంచి పలు కొత్త పోస్టులను క్రియేట్ చేయడానికి సంబంధించిన ఫైనల్ ఉన్నట్లు తెలిసింది. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పోస్ట్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో ఒకటి, ఫార్మసీ కాలేజీలో మరొకటి చొప్పున మొత్తం 3 ప్రొఫెసర్ పోస్టులకు ఈ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించనున్నది. ఇవికాక, ఎంఏయూడీ తరఫున మునిసిపల్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై స్టేటస్ నోట్లు క్యాబినెట్ ముందుకు రానున్నాయి. మున్సిపల్ బాడీల్లో ట్రాన్స్ జెండర్లకు ఒక కో ఆప్షన్ మెంబర్ నియామకానికి అవకాశం కల్పించే చట్ట సవరణతో కూడిన ఆర్డినెన్స్ ముసాయిదా బిల్లు మంత్రివర్గం ముందుకు రానున్నట్లు సమాచారం.
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా సవరణ :
ఇరిగేషన్ శాఖ తరఫున చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర) ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరించేందుకు అవసరమైన ఫైల్ క్యాబినెట్ ముందుకు రానున్నట్లు సమాచారం. దీన్ని టేకప్ చేయడంపై ఇప్పటికే ఇరిగేషన్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే వివిధ ప్రాజెక్టులకు విడుదల చేయాల్సిన నిధులపై ఇరిగేషన్ మంత్రితోపాటు ఆయా జిల్లాల మంత్రులు సైతం ఈ సమావేశంలో ప్రతిపాదనలు చేసే అవకాశమున్నది. మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా సాధించడం, నిర్వహణ కోసం నిధుల మంజూరు, రైతు భరోసా నిధుల విడుదల, దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్.. ఇలాంటివి కూడా క్యాబినెట్ మీటింగ్‌లో చర్చకు రానున్నట్లు తెలిసింది.
Read Also: డజను అంశాలతో ఎజెండా ఫిక్స్.. మూడు శాఖలపై క్యాబినెట్ చర్చ
Follow Us On : WhatsApp


