epaper
Wednesday, February 18, 2026
epaper

’మున్సిపల్‘ ప్రచారానికి తెర.. ప్రలోభాలు స్టార్ట్

కలం, వరంగల్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల (Municipal Election) ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఇప్పటి వరకు గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు రంగంలోకి దిగి జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రతి పార్టీ ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, సభలు నిర్వహించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రచారం ముమ్మరంగా సాగింది. సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో (Bhupalpally) నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క ప్రచారం చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ (KTR) చివరి రోజు భూపాలపల్లిలో ప్రచారం చేశారు. అంతకు ముందురోజు నర్సంపేటలో ప్రచారం చేశారు. బీజేపీ తరపున ఎంపీ ఈటల రాజేందర్ ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తొలిసారి మున్సిపల్ బరిలోకి దిగడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి పొత్తుగా పోటీ చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒంటరిగానే పోటీకి దిగాయి.

ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ

మున్సిపల్ పోరులో (Municipal Election) ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా మహబూబాబాద్, నర్సంపేట, జనగామ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు బరిలో ఉండటం పార్టీ అధికారిక అభ్యర్థులకు సవాలుగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులకు గాను 1072 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ నుంచి 249 మంది, బీఆర్ఎస్ నుంచి 259 మంది, బీజేపీ నుంచి 238 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిగతా 326 మంది స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు కావడం గమనార్హం.

ప్రలోభాలు షురూ!

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. దీంతో ఆయా పార్టీ‌ల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటుకు వెయ్యి నుంచి రెండు వేలు నిర్ణయించినట్లు సమాచారం. కొన్నిచోట్ల మద్యం పంపకాలు చేసేందుకు పెద్ద మొత్తం‌లో డంప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పలువురు అభ్యర్థులు చీరలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

Read Also: తెలంగాణ రాజకీయాలను మునుగోడు నుంచే శాసిస్తా : రాజగోపాల్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>