కలం, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో వ్యాపారాలు, ఆఫీసు పనులతో తల్లిదండ్రులు ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే, ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల కోసం సమయం కేటాయించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే తల్లిదండ్రులు వారిని ఆప్యాయంగా పలకరించాలి. పిల్లల మానసిక స్థితిని, వారి ఆలోచనలను, అభిరుచులను తెలుసుకునేందుకు కొన్ని రకాల ప్రశ్నలు అడగాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి పిల్లలను ఎలాంటి ప్రశ్నలు అడగాలో (Parenting Tips) ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఈ రోజు ఎవరితో ఆడుకున్నావు?
పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే సాధారణంగా “ఈ రోజు ఏం చదువుకున్నావు?” అని అడుగుతుంటారు. కానీ, దానికంటే ముందు “ఈ రోజు స్కూల్లో ఎవరితో ఆడుకున్నావు?” అని ప్రేమగా అడగండి. ఈ చిన్న ప్రశ్న మీ పిల్లల స్నేహితుల గురించిన సమాచారాన్ని మీకు అందిస్తుంది. వారు స్కూల్లో ఎవరితో ఎక్కువగా సమయం గడుపుతున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారు? అనే విషయాలు మీకు తెలుస్తాయి. అంతేకాదు, క్లాస్‌లో మీ పిల్లలు అందరితో కలిసిపోతున్నారా లేదా ఒంటరిగా ఉంటున్నారా అనేది కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
2. నిన్ను బాగా నవ్వించిన విషయం ఏంటి?
స్కూల్ నుంచి రాగానే పిల్లలను “ఈ రోజు స్కూల్లో నిన్ను బాగా నవ్వించిన లేదా ఆనందపరిచిన అంశం ఏంటి? ఎందుకు?” అని అడగండి. దీనివల్ల పిల్లల రోజంతటి అలసటను, ఒత్తిడిని ఒక్కసారిగా దూరం చేస్తుంది. స్కూల్లో జరిగిన ఒక మంచి లేదా సరదా సంఘటనను గుర్తుచేసుకోవడం వల్ల వారి మూడ్ వెంటనే మారిపోతుంది. అంతేకాకుండా, ఈ ప్రశ్న వారిని మీతో మరింత చొరవగా, మనసు విప్పి మాట్లాడేలా ప్రోత్సహిస్తుంది. తల్లిదండ్రులతో తమ సంతోషాన్ని పంచుకోవడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
3. మధ్యాహ్నం లంచ్ ఎవరితో కలిసి తిన్నావు?
పిల్లలు ఇంటికి రాగానే లంచ్ బాక్స్ ఖాళీ అయిందో లేదో చూడండి. “ఈ రోజు మధ్యాహ్నం ఎవరితో కలిసి తిన్నావు? నీ లంచ్‌ను ఫ్రెండ్స్‌తో ఏమైనా పంచుకున్నావా?” అని అడగండి. దీని ద్వారా పిల్లల సామాజిక ప్రవర్తన, వారి మనస్తత్వం మీకు అర్థమవుతుంది. తమ వస్తువులను లేదా ఆహారాన్ని ఇతరులతో పంచుకునే (Sharing) మంచి అలవాటు వారిలో అలవడుతుందా లేదా అనేది గమనించవచ్చు.
4. ఈ రోజు స్కూల్లో నీకు ఏదైనా కష్టంగా అనిపించిందా?
పిల్లలు ఎప్పుడూ తమ బాధలను లేదా భయాలను నేరుగా చెప్పలేరు. అందుకే వారితో మాట్లాడేటప్పుడు “ఈ రోజు స్కూల్లో నిన్ను ఇబ్బంది పెట్టిన లేదా నీకు కష్టంగా అనిపించిన విషయం ఏంటి?” అని ప్రేమగా అడగండి. ఈ ప్రశ్న పిల్లలు తమ మనసులోని బాధను, భయాన్ని బయటకు చెప్పడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. చదువులో ఇబ్బందులు, టీచర్స్ కోప్పడటం లేదా క్లాస్‌మేట్స్‌తో ఏవైనా గొడవలు ఉంటే వారు మీతో పంచుకుంటారు. దీనివల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గి, తల్లిదండ్రులు తమకు తోడుగా ఉన్నారనే ధీమా పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.
5. స్కూల్లో ఎవరికైనా సహాయం చేశావా?
పిల్లల్లో మంచి విలువలను పెంచడానికి “ఈ రోజు స్కూల్లో నీ ఫ్రెండ్స్‌కు ఏమైనా సాయం చేశావా? లేదా ఎవరైనా నిన్ను సాయం అడిగారా?” అని అడగండి. దీనివల్ల పిల్లలలో ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనను, దయాగుణాన్ని ప్రేరేపిస్తుంది. వారు ఎవరికైనా పెన్సిల్ ఇవ్వడం లేదా చదువులో సహాయం చేయడం వంటి చిన్న చిన్న పనులను కూడా మీతో ఎంతో ఉత్సాహంగా పంచుకుంటారు.
6. ఈ రోజు స్కూల్లో నీకు నచ్చని విషయం లేదా వ్యక్తి ఎవరు?
పిల్లలను కేవలం నచ్చిన వాటి గురించే కాకుండా, “ఈ రోజు స్కూల్లో నీకు నచ్చని విషయం లేదా నచ్చని వ్యక్తులు ఎవరు?” అని కూడా అడగండి. అలాగే దానికి గల కారణాన్ని కూడా తెలుసుకోండి. దీనివల్ల స్కూల్లో మీ పిల్లలు ఎదుర్కొంటున్న అసంతృప్తి లేదా ఇబ్బందులు బయటకు వస్తాయి.
7. ఈ రోజు క్లాస్‌లో ఏం చెప్పారు?
మీ పిల్లవాడితో రోజూ మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా “ఈ రోజు క్లాస్‌లో టీచర్స్ ఏం చెప్పారు? ఏ సబ్జెక్ట్ టాపిక్ బాగుంది?” అని అడగండి. ఈ ప్రశ్నకు పిల్లలు ఇచ్చే సమాధానాన్ని బట్టి వారికి ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టముంది, దేనిపై ఎక్కువ ఆసక్తి (Interest) చూపిస్తున్నారు అనేది సులభంగా గ్రహించవచ్చు. వారి ఆసక్తికి అనుగుణంగా ఆయా రంగాలలో వారిని మరింత ప్రోత్సహించడానికి ఇది తల్లిదండ్రులకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
8. నువ్వే గనుక టీచర్ అయితే ఏం చేస్తావు?
ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంచే ఒక అద్భుతమైన ప్రశ్న. స్కూల్ నుంచి రాగానే పిల్లలను సరదాగా “ఒకవేళ నువ్వే గనుక మీ స్కూల్ టీచర్‌వి అయితే ఏం చేస్తావు?” అని అడగండి. ఈ ప్రశ్న పిల్లల ఆలోచనా శక్తిని ప్రేరేపిస్తుంది. వారు స్కూల్ వాతావరణాన్ని ఎలా చూస్తున్నారు, వారి క్లాస్ రూమ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనేది దీని ద్వారా అర్థమవుతుంది.
9. రేపటి ప్లానింగ్ ఏంటి?
రాత్రి పడుకునే ముందో లేదా సాయంత్రం వేళల్లోనో పిల్లలతో మాట్లాడుతూ.. “రేపు స్కూల్లో ఏం చేయబోతున్నారు? రేపు జరిగే ఏ విషయం కోసం నువ్వు ఆత్రుతగా ఎదురుచూస్తున్నావు?” అని అడగండి. ఈ ప్రశ్న పిల్లలలో రేపటి రోజుపై ఒక స్పష్టతను, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రేపు స్కూల్లో జరగబోయే స్పోర్ట్స్ పీరియడ్, డ్రాయింగ్ క్లాస్ లేదా ఏదైనా ఈవెంట్ గురించి వారు ముందే ఆలోచించడం వల్ల, మరుసటి రోజు ఉదయం ఎటువంటి మారాం చేయకుండా ఎంతో సంతోషంగా స్కూల్‌కు బయలుదేరుతారు.

