కలం, వెబ్ డెస్క్ : ముంబై (Mumbai) మహానగరంలోని భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్డుపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రిహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (BEST)కు చెందిన ఒక బస్సు రివర్స్ తీస్తున్న సమయంలో అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు తన రూట్ ముగింపు పాయింట్ వద్ద రివర్స్ చేస్తుండగా, అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి పాదచారులను ఢీకొట్టింది.
స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు, ఇళ్లకు తిరిగి వెళ్తున్న వారు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం తీవ్రతను పెంచింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని ప్రాథమిక సమాచారం. వారిలో గుర్తు తెలియని మహిళ(31) రాజావాడీ ఆసుపత్రిలో మృతి చెందింది. మరో ముగ్గురు ఎం.టి. అగర్వాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
గాయపడినవారిలో 51 ఏళ్ల ప్రశాంత్ లాడ్ పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన తొమ్మిది మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి మెకానికల్ ఫెయిల్యూర్, మానవ తప్పిదం ఇతర కారణాలు ఉన్నాయా అని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమాచారం అందగానే ముంబై (Mumbai) పోలీసులు, అగ్నిమాపక దళం, BEST సిబ్బంది, 108 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
Read Also: ప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థం
Follow Us On: Instagram


