కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi), వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. గత ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు పూర్తి అంగీకారం తెలపడంతో తాజాగా ఈ నిశ్చితార్థం వేడుక జరిగింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రేహాన్ ఇటీవల అవీవాకు ప్రపోజ్ చేయగా ఆమె ఆనందంగా అంగీకరించారు. అవీవా బేగ్ ఢిల్లీ నివాసి. రేహాన్(Raihan Vadra) మాదిరిగానే ఆమె కూడా వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్. నిశ్చితార్థం వార్త వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వీరిద్దరి పాత ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక ఫొటోలో రేహాన్ అవీవాను హగ్ చేసుకుంటూ కనిపిస్తుండగా, మరో గ్రూప్ ఫొటోలో స్నేహితులతో కలిసి నవ్వుతూ కనిపిస్తున్నారు. రంగుల పెయింటింగ్‌ల నేపథ్యంతో ఉన్న మరో చిత్రంపై ‘గుడ్ వన్ బాయ్స్’ అనే క్యాప్షన్ కూడా ఉంది.
వివాహ తేదీని ఇరు కుటుంబాలు త్వరలోనే నిర్ణయిస్తాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని వదులుకోవడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన సంగతి తెలిసిందే.
రేహాన్ వాద్రా తల్లి ప్రియాంక గాంధీతో పలు సందర్భాల్లో వేదికలపై కనిపించినప్పటికీ, రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఆయన విజువల్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు పొందారు. ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించగా, కోల్‌కతాలో కూడా ఆయన ఫొటోగ్రఫీ ప్రదర్శన జరిగింది. బాల్యం నుంచే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న రేహాన్, ప్రస్తుతం కమర్షియల్ ఫొటోగ్రఫీ కూడా చేస్తున్నారు.
రేహాన్ వాద్రా డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ ‘దూన్ స్కూల్’లో చదువుకున్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఇదే స్కూల్‌లో చదువుకోవడం విశేషం. అనంతరం లండన్ వెళ్లిన రేహాన్, అక్కడి SOAS యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఏడు సంవత్సరాల ప్రేమ బంధం నిశ్చితార్థంతో కొత్త మైలురాయిని చేరుకోవడంతో రేహాన్–అవీవా జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: ‘హిల్ట్’ పాలసీకి స్పందన కరువు !
Follow Us On: Sharechat


