కలం, నిర్మల్ : గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Mudhole MLA Pawar Ramarao Patel) అన్నారు. సోమవారం బాసర మండలంలోని దోడాపూర్, కిర్గుల్-బి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. దోడాపూర్ గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫంక్షన్ హాల్ కు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
అనంతరం కిర్గుల్-బి గ్రామంలో రూ.45 లక్షలతో చేపట్టనున్న మహిళా సమైక్య సంఘ భవనం, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం బాసర మండల కేంద్రంలోని పాపహరేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

