కలం, వనపర్తి: పేద ప్రజలకు అత్యవసర వైద్య చికిత్సల సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కొండంత అండగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి (Gillella Chinna Reddy) అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులలో చికిత్స పొందిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.45.31 లక్షల విలువైన 150 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను పాలనకు కేంద్రబిందువుగా చేసుకుని సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రగతిలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 1 నాటికి వెయ్యి రోజుల పాలన మైలురాయిని చేరుకోనుందని తెలిపారు. గత ప్రభుత్వ అప్పులను తీర్చుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందన్నారు.
ఆరోగ్యశ్రీ వర్తించని వారికి సీఎంఆర్‌ఎఫ్ అండ
ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందుతున్నాయని చిన్నారెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ వర్తించని వారికి చికిత్స అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఉపశమనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సాయం కొండంత ఆసరాగా నిలుస్తోందన్నారు. వనపర్తి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, మానవతా దృక్పథంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేరేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని చిన్నారెడ్డి కోరారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ నాయకుడు అక్తర్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, కో-కోఆర్డినేటర్ చంద్రశేఖర్, వనపర్తి జిల్లా ఏఐపీసీ అధ్యక్షుడు నాగార్జున, పట్టణ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ బాబా, యూత్ కాంగ్రెస్ నాయకులు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

