కలం, ఖమ్మం బ్యూరో: చెల్లెలిని వేధించవద్దని మందలించిన కక్షతోనే మణుగూరు (Manuguru) నేతాజీ గ్రౌండ్లో సింహాద్రి శివకుమార్ అలియాస్ శివ దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంచలనాత్మక హత్య కేసును ఛేదించిన మణుగూరు పోలీసులు, ప్రధాన నిందితుడు ‘జెట్ పట్’ రమ్యాకాంత్తో సహా 23 మందిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన మృతుడు సింహాద్రి శివకుమార్, సతీష్ తో కలిసి గత నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ఇంటీరియర్ పనులు చేసుకుంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన లోకేష్ అనే యువకుడు నెల రోజుల క్రితం హైదరాబాద్‌లో ఉన్న సతీష్ చెల్లెలికి ఫోన్ చేసి వేధించడమే ఈ గొడవకు కారణమైంది. చెల్లెలి విషయమై సతీష్, లోకేష్ మధ్య గొడవ జరుగుతుండగా శివ అడ్డుపడి సతీష్‌కు మద్దతుగా నిలిచాడు.
ఈ విషయాన్ని లోకేష్ తన గ్యాంగ్ లీడర్ అయిన ‘జెట్ పట్’ రమ్యాకాంత్ అలియాస్ జెట్టికి చెప్పడంతో, వారు శివపై కక్ష పెంచుకున్నారు. ఈ నెల 26న రాఖీ పండుగకు మణుగూరు వస్తే చంపేస్తామంటూ జెట్టి ఫోన్ చేసి బెదిరింపులకు దిగడంతో శివ కూడా తీవ్రంగా ప్రతిఘటించాడు. దాంతో ఆగ్రహానికి గురైన జెట్టి, మణుగూరుకు రావాలంటూ శివకు సవాల్ విసిరాడు.
పథకం ప్రకారం మాటు వేసి దాడి!
ఆగస్టు 27న ఉదయం శివ హైదరాబాద్ నుంచి మణుగూరుకు వచ్చి, తన స్నేహితుడు ఉదయ్ కిరణ్‌తో కలిసి బైక్‌పై నెతాజీ గ్రౌండ్ వైపు వెళ్లాడు. అప్పటికే రమ్యాకాంత్ తన ముఠా సభ్యులైన సాదిక్, వినయ్, దినేష్, జంపయ్య, ప్రసాద్ తదితరులతో కలిసి నెతాజీ గ్రౌండ్ వద్ద పక్కా పథకంతో వేచి ఉన్నాడు. శివ అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా ముకుమ్మడిగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
మృతుడి తండ్రి సింహాద్రి అప్పారావు ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో మొత్తం 27 మంది పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిలో 23 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల వద్ద నుంచి 9 బైక్‌లు, 20 సెల్ఫోన్లు, ఒక కర్ర, చేతి కడియంను స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న మిగతా నలుగురు వ్యక్తుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

