కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరాన్ని అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తెలిపారు. నగర శివారు ప్రాంతాలలో గల్లీగల్లీలో కొత్త రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్‌లోని 45వ డివిజన్ మంకమ్మతోటలో ఎమ్మెల్సీ గోపాల్ రావు బిల్డింగ్ సమీపంలో రూ.70 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టనున్న డ్రెయిన్ పైప్‌లైన్, సీసీ రోడ్డు పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
రూ.840 కోట్లతో నగర రూపురేఖల మార్పు
కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఇప్పటికే రూ.50 కోట్ల యూఐడీఎఫ్ నిధులు తీసుకొచ్చామని బండి సంజయ్ తెలిపారు. మరో రూ.30 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే యూసీఎఫ్ జాబితాలో కరీంనగర్‌ను చేర్పించి రూ.840 కోట్ల నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ నిధులతో నగర రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు రూ.630 కోట్లతో 50 కిలోమీటర్ల మేర 40 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు కలిగిన మోడల్ రోడ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. జిల్లా కోర్టు, సివిల్ ఆసుపత్రి, గీతాభవన్ ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తామని, కరీంనగర్ బస్‌స్టేషన్ వద్ద హైదరాబాద్ ఉప్పల్ తరహాలో స్కైవాక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
80 కిలోమీటర్ల స్టార్మ్ వాటర్ డ్రైనేజీ
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 80 కిలోమీటర్ల మేర స్టార్మ్ వాటర్ డ్రైనేజీ కాలువలు నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని చెప్పారు. నగరంలోని ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లను గుర్తించి వాటిని సుందరంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించేందుకు 130 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు.
డంపింగ్ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం
కరీంనగర్‌లో ప్రధాన సమస్యగా మారిన డంపింగ్ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని బండి సంజయ్ తెలిపారు. రూ.80 కోట్లతో సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను సేకరించి, ప్రాసెసింగ్ కేంద్రంలో వేరు చేసి, రీసైకిల్ చేసి శాస్త్రీయంగా పారవేసేలా బదిలీ కేంద్రం, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం గత ఏడేళ్లలో రూ.22 వేల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసినట్లు బండి సంజయ్ తెలిపారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుని కరీంనగర్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

