కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 27 వేల ప్రభుత్వ పాఠశాలలను కేవలం 4 వేలకు కుదించి, మిగతావాటిని మూసివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు.సిద్దిపేట జిల్లా తడ్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జోగు వెంకటేశం పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
హరీశ్ రావు మాట్లాడుతూ .. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు దాచుకున్న సొంత పైసలు రావాలన్నా ప్రభుత్వం 15% కమీషన్ అడుగుతున్న దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందన్నారు. ఉద్యోగులకు సంబంధించి 6 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. సీపీఎస్ విధానం రద్దు చేస్తామని ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని మండిపడ్డారు.మార్కెట్లో గుడ్డు ధర 8 రూపాయలు ఉంటే, మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 3 రూపాయలేనని, ఇది వారి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు.
తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, అంతవరకు విద్యా వాలంటీర్లను నియమించి పాఠశాలల్లో విద్యాబోధన దెబ్బతినకుండా చూడాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు.

