కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో శనివారం రాత్రి జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk And Drive) తనిఖీలు తీవ్ర కలకలం రేపాయి. వాహనాల తనిఖీల్లో భాగంగా బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఒక వాహనదారుడు పోలీసులకు సహకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సదరు వాహనదారుడి చెంప చెల్లుమనిపించారు. ఈ ఊహించని ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. వాహనదారులు తనిఖీలకు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ, ఇలా రోడ్డుపై సామాన్యులపై భౌతిక దాడి చేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారంటూ నెటిజెన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తనపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

