కలం/ఖమ్మం బ్యూరో : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను మూడు నెలల్లో మూడొందల వరకూ పెంచిందని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury) విమర్శించారు. ఖమ్మం కాంగ్రెస్ భవన్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. యుద్ధం కారణంగా నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే కేంద్రం ఎందుకు అరికట్టలేక పోతుందని ఎంపీ ప్రశ్నించారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కరెంటు లేని గూడెంలు ఉన్నాయన్నారు.
రాబోయే రోజుల్లో యూరియా కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని.. కేంద్రం పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని రేణుకా చౌదరి (Renuka Chowdhury) డిమాండ్ చేశారు. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఈ అంశాలన్నీ లేవనెత్తుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారని కొనియాడారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలని హితవు పలికారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

