కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని రైలు పట్టాల్లా నడిపించే కొత్త వ్యవస్థకు ఏఐసీసీ (AICC) శ్రీకారం చుట్టింది. జోడెద్దుల లాగా మెరుగైన సమన్వయంతో పరిపాలన, పార్టీ యాక్టివిటీస్ జరిగేలా ఆలోచన చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయ్యి కీలకమైన దశకు చేరుకున్న సమయంలో పార్టీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేలా సమన్వయ కమిటీని (Coordination Committee) ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రతినిధుల నుంచి అందిన ప్రతిపాదనను చర్చించిన ఏఐసీసీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు సమ్మతి తెలిపారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారో కూడా ఏఐసీసీ ఒక సర్క్యులర్‌లో వెల్లడించింది. ఇటు ప్రభుత్వం నుంచి, అటు పార్టీ నుంచి ప్రతినిధులు ఉండేలా ఈ కమిటీ కూర్పు జరిగింది.
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తగ్గనున్న గ్యాప్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రచారం చేసుకోవడంలో పార్టీ వెనకబడిందని చాలా కాలంగా అసంతృప్తి నెలకొన్నది. మంత్రుల్లోనూ, పార్టీ లీడర్లలోనూ ఇది బలంగానే ఏర్పడింది. అందువల్లనే పలు పార్టీ సమావేశాల్లో ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడినా పార్టీకోసం కష్టపడినవారికి తగిన అవకాశాలు రావడంలేదని, నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంలేదన్న అసంతృప్తి రాష్ట్ర, జిల్లా స్థాయి నేతల్లో, కేడర్‌లో నెలకొన్నది. ఈ రెండింటినీ సమన్వయం చేయడానికి ఇంతకాలం తగిన మెకానిజం లేకపోవడంతో అభిప్రాయాలు వెల్లడి కావడమే తప్ప పరిష్కారానికి నోచుకోవడంలేదు. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటి కీలకమైన దశలోకి చేరుకున్న సమయంలో అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర, కేంద్ర నేతలు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇకపైన ఈ కమిటీ ఇరుపక్షాల మధ్య ప్లానింగ్‌తో పాటు సమన్వయం చేయనున్నది.
కమిటీలో సీఎం, పీసీసీ చీఫ్, ఇన్‌చార్జి :
ఈ కమిటీలో పార్టీ, ప్రభుత్వ పెద్దలకు చోటు కల్పించింది ఏఐసీసీ (AICC). ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క ఉంటారు. పార్టీ తరఫున పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ తరఫున వంశీచంద్ రెడ్డి ఉంటారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళే బాధ్యతను పార్టీ తరఫున ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. అమలు చేయబోయే స్కీమ్‌ల గురించి, సంక్షేమం కోసం చేస్తున్న కృషి గురించి ఏయే రూపాల్లో ఎలా ప్రచారం కల్పించాలో కూడా ఈ కమిటీ ఆలోచన చేస్తుంది. మరోవైపు పార్టీ కోసం కష్టపడినవారికి ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఎలాంటి పదవులు ఇచ్చి వారికి న్యాయం చేయాలో కూడా ప్రభుత్వంతో సమన్వయం చేస్తుంది.

