కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలైన సామాజిక న్యాయం, సెక్యులరిజంపై పూర్తి నమ్మకం ఉన్న వ్యక్తి మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అని, ఆయన కింది స్థాయి నుంచి పీసీసీ చీఫ్‌గా ఎదగడం ఎంతో సంతోషకరమని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మల్లు రవి మాట్లాడారు. మహేశ్ కుమార్ గౌడ్ గతంలో ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేసి పార్టీని సమర్థవంతంగా నడిపించారని, అందుకే ఆయన నాయకత్వాన్ని ఏఐసీసీ సైతం కొనియాడిందని గుర్తు చేశారు. ఆయన పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్రంలో కుల గణన (Caste Census) ప్రక్రియలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాగే స్థానిక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించి గెలిపించుకున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన వారికి చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఇచ్చే విషయంలో ఎలాంటి విబేధాలు రాకుండా సీఎం రేవంత్‌తో కలిసి సమన్వయం చేసుకున్నారని, నిరంతరం ప్రజల సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తున్నారని ప్రశంసించారు.
ఇక కొద్ది రోజులుగా పీసీసీ చీఫ్‌పై వస్తున్న కొన్ని మీడియా కథనాలపై మల్లు రవి (Mallu Ravi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తుందని, అయితే వార్తలు ప్రసారం చేసేటప్పుడు మీడియా సంస్థలు వాస్తవాలను ఆలోచించి రాయాలని హితవు పలికారు. పీసీసీ అధ్యక్షుడిపై పని గట్టుకొని ఎందుకు కొన్ని తప్పుడు వార్తలు ప్రసారం అయ్యాయో, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో? అన్న దానిపై లోతుగా దర్యాప్తు చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!
Read Also: క్యాన్సర్ రోగుల పాలిట సంజీవని.. డాక్టర్ సదాశివుడు!

