Mobile Popup Ad
Mobile Popup Ad

క్యాన్సర్ రోగుల పాలిట సంజీవని.. డాక్టర్ సదాశివుడు!

కలం, కరీంనగర్ బ్యూరో: ఆయనో సామాన్య చేనేత కార్మికుడి కుమారుడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. పేదరికం కారణంగా అన్నింటికీ ఇబ్బందులే. పైగా సరైన సదుపాయాలు లేని ఊరు.. కారు చీకట్లో నడుమ ఆయనకు చదువు చిరుదీపం అయింది. పట్టుదలతో కష్టపడి.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ గొప్ప డాక్టర్‌గా పేరు సంపాదించాడు. అంతేగాకుండా, క్యాన్సర్ రోగుల జీవితాల్లో ఆశలు నింపుతూ సంజీవనిలా మారారు. ఆయనే హుజూరాబాద్‌కు చెందిన ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ గుండేటి సదాశివుడు (Doctor Sadashivudu).

గురువు చెప్పిన పాఠాలే..

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గంలోని గొడిశాల గ్రామ పంచాయతీ పరిధి యల్లంపల్లిలోని పేద పద్మశాలి చేనేత కార్మిక కుటుంబంలో జన్మించారు సదాశివుడు. తల్లిదండ్రులు గుండేటి రామచంద్రం, మీనాక్షి. చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి కనబరిచేవారు సదాశివుడు. ఊరిలో సరైన పాఠశాల లేకపోవడంతో, సదాశివుడి ప్రతిభను గుర్తించి వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు పశువుల పాకలోనే పాఠాలు చెబుతూ సదాశివుడిలో చదువుపై ఆసక్తిని, ఉన్నత ఆశయాలను నూరిపోశారు. అలా గురువు ఇచ్చిన స్ఫూర్తితో 1986లో హుజూరాబాద్ జడ్పీ హైస్కూల్‌లో పాఠశాల విద్య, 1988లో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తరువాత విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, అనంతరం వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ పూర్తి చేశారు. క్యాన్సర్ రోగుల బాధలను చూసి చలించిపోయిన ఆయన.. మెడికల్ ఆంకాలజీలో స్పెషలైజేషన్ పూర్తి చేసి, క్యాన్సర్ నిపుణుడిగా మారారు.

క్యాన్సర్ విభాగానికి అధిపతిగా..

పేదల ఆసుపత్రిగా పేరొందిన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ వైద్యుడిగా చేరిన డాక్టర్ సదాశివుడు (Doctor Sadashivudu).. గత 18 ఏళ్ల కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగానికి ప్రొఫెసర్, హెడ్‌గా సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవలే ప్రతిష్ఠాత్మక ఎం.ఎన్.జే (MNJ) క్యాన్సర్ హాస్పిటల్ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా కూడా నియమించింది. ఆయన భార్య డాక్టర్ కిరాంత కూడా హైదరాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా సేవలు అందిస్తున్నారు.

మూలాలు మరవని తత్వం..

వైద్య పరిశోధనల్లో కూడా డాక్టర్ సదాశివుడు అద్భుత ప్రతిభ కనబరిచారు. అమెరికాలోని చికాగోలో జరిగిన గ్లోబల్ క్యాన్సర్ సదస్సుల్లో (ASCO) మన దేశం తరఫున రీసెర్చ్ పేపర్లను సమర్పించి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాసిన 80కి పైగా పరిశోధనా వ్యాసాలు అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు తెలంగాణ ప్రభుత్వం 2017లో బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డు, 2018లో బెస్ట్ టీచర్ అవార్డు అందించి సత్కరించింది. మారుమూల గ్రామం నుంచి రాష్ట్రంలోనే ప్రముఖ వైద్యుడిగా ఎదిగినా డాక్టర్ సదాశివుడు తన మూలాలను మర్చిపోలేదు. సొంతూరిలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. అలాగే, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పేదరికం చదువుకు అడ్డుకాదని, సంకల్పం ఉంటే ఎంతటి ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన డాక్టర్ గుండేటి సదాశివుడు నేటి యువతకు నిజమైన ఆదర్శమని గ్రామస్థులు కొనియాడుతున్నారు.

Read Also: బరువు తగ్గాలా? ఇలా స్టెప్ బై స్టెప్ ట్రై చేయండి!

Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>