Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్ అప్పులపై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు

కలం, నాగర్ కర్నూల్: బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం చెబుతున్న ఆరోపణలు వాస్తవమేనని, వాటిని ఆధారాలతో నిరూపిస్తామని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి (MP Mallu Ravi) అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరిన సవాల్‌కు కేటీఆర్, హరీశ్ రావు స్పందించి రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ మల్లు రవితో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కుచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.

మల్లు రవి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు. ఆ ఆరోపణలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని జూపల్లి ప్రకటించారని, ఇప్పుడు కేటీఆర్, హరీశ్ రావు కూడా అదే స్థాయిలో స్పందించాలని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తూనే ముసీ నది ప్రక్షాళన, సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ అమలు చేయని పలు సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. గత ఎన్నికలలో బీఆర్ఎస్‌కు 100 సీట్లు వస్తాయని కేటీఆర్, హరీశ్ రావు చెప్పినా ప్రజలు తిరస్కరించారని, అనంతరం జరిగిన లోక్‌సభ, ఉపఎన్నికలలో కూడా ఆ పార్టీ ఓటమిని చవిచూసిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల అమలుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలేనని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకు తగిన న్యాయం జరగలేదని అన్నారు. కృష్ణా జలాల విషయంలోనూ గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే అన్యాయం జరిగిందని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుపై భారీగా ప్రజాధనం వృథా అయిందని విమర్శించారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కుచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. నార్లాపూర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందలేదని, బీఆర్ఎస్ నేతలు డ్రామాలు మానుకుని మంత్రి జూపల్లి విసిరిన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల్ సునేంద్ర, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు జక్కా రాజు, ఎస్సీ సెల్, యూత్ కాంగ్రెస్ నాయకులు నిరంజన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>