కలం, నిజామాబాద్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లాలో ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించడాన్ని నిజామాబాద్ ఎంపీ (Nizamabad MP) ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) స్వాగతించారు. విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు వెల్లడించారు.
కేంద్రీయ విద్యాలయ సంఘం (KVS) నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కనీస అవసరమే కాగా, మెట్రో నగరాల వెలుపల ఉన్న విద్యాలయాలకు 10 ఎకరాలు అనువైన ప్రమాణమని ఆయన పేర్కొన్నారు. అదనపు భూమి ఉంటే విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, భవిష్యత్తు విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే అవకాశం ఉంటుందని వివరించారు.
జగిత్యాల జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యా వాతావరణం అందించాలనే ఉద్దేశంతో గతంలోనే 10 ఎకరాల భూమి కేటాయించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి భూ కేటాయింపును 10 ఎకరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

