కలం, కరీంనగర్ బ్యూరో : ప్రస్తుత సమాజంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ నియంతృత్వ పాలన సాగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Gaddam Vamsi) అన్నారు. అధికారం కోసం బ్రిటిష్ వారి తరహాలో ‘విభజించు-పాలించు’ కుట్రలకు పాల్పడుతూ కులాల మధ్య చిచ్చుపెట్టి దళితులు, బడుగు వర్గాలను అణగదొక్కాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టేందుకు బడుగు, బలహీన వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి (Peddapalli) పట్టణంలో నిర్వహించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50 ఏళ్ల స్వర్ణోత్సవ మహాసభతో పాటు మంథని, మహాదేవపూర్‌లో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. తొలుత పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు.
దేశ జనాభాలో 25 నుంచి 30 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్లో కేవలం 2 శాతం నిధులే కేటాయించడం అన్యాయమని అన్నారు. జనాభా ప్రాతిపదికన 30 శాతం నిధులు కేటాయించాలని పార్లమెంట్లో పోరాడుతున్నట్లు తెలిపారు. కాకా వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ విద్యాసంస్థల వల్లే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ వంటి ఎందరో మేధావులు తయారయ్యారని గుర్తుచేశారు.
గత పదేళ్ల పాలకులు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో యువతను మోసం చేశారని, ఐటీ ముసుగులో సొంత వ్యాపారాలను పెంచుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో 80 సెంటర్ల ద్వారా 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రూ.4 వేల కోట్లతో టాటా భాగస్వామ్యంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, టామ్‌కామ్ ద్వారా 10 వేల మందికి విదేశీ ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ సాధనతో స్థానిక యువతకు వెయ్యికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని, రూ.4 వేల కోట్లతో రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అలాగే చారిత్రక రామగిరి ఖిల్లాను రూ.8 కోట్లతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

