సంగాల పార్కుకు పెరుగుతున్న‌ సంద‌ర్శ‌కుల తాకిడి

కలం, జోగులాంబ గద్వాల: పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ చెన్నకేశవ సంగాల పార్కు (Sri Chennakeshava Sangala Park) ఆదివారం సందర్శకులతో సందడిగా మారింది. వారాంతపు సెలవు కావడంతో పట్టణంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కుటుంబ సభ్యులతో కలిసి పార్కుకు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకుల రాకపోకలతో పార్కు కళకళలాడింది. పార్కులో ఏర్పాటు చేసిన పచ్చని గడ్డి, ఆహ్లాదకరమైన వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆట వస్తువులు పిల్లలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పిల్లలు ఆట వస్తువులపై ఆడుకుంటూ కేరింతలు కొట్టగా, తల్లిదండ్రులు వారితో కలిసి సరదాగా సమయం గడిపారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి పార్కులో విహరిస్తూ ఆనందంగా గడిపారు.

ఫొటోలు.. సెల్ఫీల సందడి

పార్కులోని ఆహ్లాదకరమైన పరిసరాల్లో యువత, చిన్నారులు ఫొటోలు దిగుతూ, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకేచోట చేరి ముచ్చటించుకుంటూ ఆనందంగా గడిపారు. రోజువారీ పనులు, ఉరుకుల పరుగుల జీవితం నుంచి కాస్త విరామం తీసుకుని ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు పార్కుకు వచ్చినట్లు పలువురు సందర్శకులు తెలిపారు.

ఆహ్లాదానికి ఆహ్వానం పలుకుతున్న పార్కు

గద్వాల పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయం ప్రశాంతంగా గడిపేందుకు సంగాల పార్కు మంచి వేదికగా మారింది. పచ్చని వాతావరణం, చిన్నారుల ఆట స్థలాలు ఉండటంతో రోజురోజుకూ సందర్శకుల ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో పార్కుకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. పార్కును మరింత అభివృద్ధి చేసి, పరిశుభ్రతతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలను నిరంతరం నిర్వహించాలని సందర్శకులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>