కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలి: ఈటల

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్ల యావ తప్ప ఆర్టీసీ కార్మికుల బాధ కనిపించడం లేదా? అని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ (MP Etela Rajender) ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హకింపేట డిపో వద్ద సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపి మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు 40 రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చినా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మంత్రులకు స్వేచ్ఛ లేకుండేదని.. రేవంత్ మంత్రివర్గంలోనూ అలానే ఉందా? అంటూ ఫైర్ అయ్యారు. దీనిపై పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలన్నారు. రవాణా శాఖ మంత్రికి హక్కులు, బాధ్యతలు ఉన్నాయా? లేవా? తేల్చుకోవాలన్నారు. అమరుడైన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌కు నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఈనాటి వరకు తెలంగాణది బలి దానాలు చరిత్ర, రక్త తర్పణాల చరిత్ర, ఆత్మహత్య చరిత్ర అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయని భావించామని.. ఈ బలిదానాలు మంచివి కావని చెప్పారు. బరిగిసి కోట్లాడుదామని ఆర్టీసీ కార్మికులకు ధైర్యం చెప్పారు. కార్మికుల వెంటే తాము ఉంటామని.. ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

‘రిమూవల్ ఫ్రమ్ సర్వీస్’ ఇంకా ఎక్కువైంది..

మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సి పెరిగిందని ఈటల తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వచ్చిన తర్వాత కండక్టర్ 10-12 గంటలు నిలబడాల్సిందే తప్ప కూర్చునే పరిస్థితి లేదన్నారు. కిక్కిరిసిన బస్సును డ్రైవ్ చేయడం కూడా డ్రైవర్స్ కి ఇబ్బందిగా మారిందని చెప్పారు. మహిళలకు మంచి జరుగుతుంది. కానీ సిబ్బందికి ఎంత ఇబ్బంది అవుతుందని తెలుసుకొనే సోయి కాంగ్రెస్ నాయకులకు లేదని మండిపడ్డారు. ఉద్యోగ భద్రత దొరుకుతుందని చదువుకున్న వారు కూడా ఆర్టీసీలో పనిచేస్తున్నారని చెప్పారు. పొరపాటు జరిగితే ‘రిమూవల్ ఫ్రమ్ సర్వీస్’ అని తొలగించే విధానం పోవాలని అప్పుడు సమ్మె చేస్తే.. అది ఇప్పుడు ఇంకా ఎక్కువైందన్నారు. కొద్దిసేపు బస్సులో నిలబడితేనే ఈ ఎండాకాలంలో చెమటతో ఇబ్బంది అవుతుందని, అలాంటిది గంటల కొద్దీ డ్యూటీ చేయడం ఎంత ఇబ్బంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్నారు.

‘కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్’ రద్దు చేయాలి..

కాంట్రాక్ట్, ఔట్ సోర్స్ సిబ్బందికి కూడా గతంలో ఆర్టీసీ సంస్థ జీతాలు ఇచ్చేది.. కానీ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కంపెనీలకు కట్టబెట్టి.. పర్మినెంట్ అవుతామని చేరే వారి ఆశల మీద నీళ్లు చల్లుతున్నారని ఈటల మండిపడ్డారు. ఈ అవుట్ సోర్సింగ్ కంపెనీలు వచ్చే 15 వేల జీతం నుండి 3 వేల రూపాయలు కమీషన్ కట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు బెంగాల్ బీహార్ ఇతర రాష్ట్రాల వారిని ఎంపిక చేస్తున్నారని.. తెలంగాణ వారికి ఆ ఉద్యోగాలు కూడా దక్కనివ్వడం లేదని మండిపడ్డారు.ఆర్టీసీ కార్మికులు అంటే బాండెడ్ లేబర్స్ లాగా తయారయిందని.. వారి చేతవెట్టిచాకిరి చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎలక్ట్రిక్ బస్సులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని.. ఆ సబ్సిడీ వినియోగించుకొని ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె చేయాలని ఎవరు అనుకోరని… చావో రేవో తేల్చుకోవడానికి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>