కలం, వెబ్ డెస్క్ : విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy).. ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు తన హవా కొనసాగించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మాజీ రాజ్యసభ సభ్యుడు అయిన ఆయన (Vijaya Sai Reddy) అధికారం కోల్పోయిన తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే పార్టీని వదిలి బయటకు వచ్చి.. రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే, విజయసాయి రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్ కు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మొదటి సారీగా భారీ ప్రకటన చేశారు. త్వరలోనే భారీ మీడియా ఫ్లాట్ ఫాంను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డి పోస్ట్ చేశారు. తాజాగా ఆయన మరోసారి కొత్త రాజకీయ పార్టీపై కీలక ప్రకటన చేశారు.
ఏపీ లిక్కర్ కేసులో విజసాయిరెడ్డి ఇంట్లో శుక్రవారం జరిగిన ఈడీ సోదాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని జులైలో కొత్త పార్టీ పెడుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. త్వరలో మీడియా రంగంలోకి కూడా ప్రవేశించబోతున్నట్లు మరోసారి వెల్లడించారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్సార్సీపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. అలాగే, ఈడీ సోదాల్లో తన దగ్గర అధికారులకు ఏమీ లభించలేదన్నారు. అధికారులు విచారించాల్సింది తనను కాదని, సీఎం చంద్రబాబు నాయుడిని అని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయసాయి రాజకీయ పార్టీతో వైసీపీ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఆ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉండడంతో పాటు మాజీ నేతగా, జగన్ కు సన్నిహితుడిగా మంచి పేరు తెచ్చుకున్న విజయసాయికి పార్టీలో అనుచరులు ఎక్కువగానే ఉన్నారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం కష్టమనే అంచనాలు మొదలయ్యాయి. మూడు రాజధానుల పేరుతో నెగెటివిటీ సంపాదించుకున్న జగన్.. జనాల్లో ప్రాబల్యంతో పాటు అధికారాన్ని కోల్పోయాడు. ఇదే అదనుగా ఉవ్వెత్తున లేచిన టీడీపీ అధికారం చేజిక్కించుకుంది. అప్పటి నుంచి జగన్ తో పాటు వైసీపీ ప్రభావం పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయి పార్టీ పెడితే జగన్ కు భారీ దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

