కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్ తరాలకు రక్ష అని, వ్యవసాయం దండగ కాదు పండుగ అనే సంకల్పంతో ముందుకు వెళదామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) అన్నారు. వనపర్తి జిల్లా మదనపురం కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన కేత్ బచావో కార్యక్రమంలో భాగంగా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం పై రైతుల అవగాహన సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు.
తన చిన్నతనంలో పశుసంపద, ఎద్దులు ప్రతి ఇంట్లో ఉండేవని, ఆవుల మందలు సాయంత్ర సమయంలో ఊర్లోకి వస్తుంటే చాలా సంబరంగా అనిపించేదని ఈ సందర్భంగా ఆ రోజులను ఎంపీ గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో మన గ్రామాల్లో ఆర్గానిక్ ద్వారా పండించిన పంటలు, కూరగాయలు, పండ్లు తినడం వల్లే నేటికీ ఆరోగ్యంగా ఉంటున్నామని ఆమె తెలిపారు.
అయితే ప్రస్తుతం ప్రజలంతా గ్రామాలు వదిలి, పట్టణాలకు పోవాలని చూస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. పట్టణాల్లో గాలి నుంచి ప్రతి వస్తువు కల్తీ గా మారిందనీ, వాతావరణం సైతం కలుషితంగా మారిందన్నారు. గతంలో భూములు, బంగారం ఉంటే ధనవంతులు అనేవారని..కానీ నేడు భూములు అమ్ముకొని పట్టణాలకు వలస వెళ్లడం ప్యాషన్ మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో రైతులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.
ఇతర దేశాలలో భూములు తీసుకొని మరి సేంద్రియ వ్యవసాయం లాభాలు గడిస్తున్నారని ఆమె తెలిపారు. మన దేశంలో రసాయన ఎరువులు విపరీతంగా వేయడం ద్వారా భూమి సారాన్ని పూర్తిగా చంపుతున్నామని, రసాయన మందులు జల్లకుండా, భూములను కాపాడుకుందాం .. ఆరోగ్యాన్ని రక్షించుకుందాం అంటూ ఆమె పిలుపునిచ్చారు. వ్యవసాయం దండగ కాదు.. చిత్తశుద్ధి ఉంటే.. సేంద్రియ వ్యవసాయం చేస్తే పంగడే అవుతుందన్నారు.
పకృతి, సేంద్రీయ వ్యవసాయం విస్తరించాల్సిన అవసరం తప్పక ఉందనీ, ఆ దిశగా రైతన్నలను చైతన్య పర్చాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రతి రైతు కొద్దిగా ఆలోచిస్తే స్థానికంగానే పకృతి సిద్ధంగా ఎరువులు తయారు చేసుకోవచ్చునని ,రైతులకు ఖర్చులు కూడా బాగా తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఇంటికి ఒక ఆవు తప్పని సరిగా పెంచాలని, పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని కోరారు.
రైతులు ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడితే, ఖర్చులు తగ్గుతాయన్నారు. ప్రభుత్వ సబ్సిడీలు ఎక్కువగా అందుతాయి, మార్కెటింగ్ సులభతరం అవుతుందని చెప్పారు.దేశ వ్యాప్తంగా కేత్ బచావో అభియాన్ లో భాగంగా ప్రతి జిల్లాలో రైతు సమావేశాలు జరుగుతున్నాయని డీకే అరుణ (DK Aruna) తెలిపారు. కె వి కె వ్యవసాయ శ్రస్త్రవేత్త రాజేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు పద్మజా రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి,రైతులు,వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లా,మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ
Follow Us On: Instagram

