Mobile Popup Ad
Mobile Popup Ad

యూరియా సరఫరాలో తెలంగాణ దేశానికే ఆదర్శం: విజయరమణారావు

కలం, కరీంనగర్ బ్యూరో (పెద్దపల్లి): యూరియా సరఫరాలో యాప్ ఆధారిత విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు (Vijayaramana) అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డి తో కలిసి యూరియా బుకింగ్ యాప్ వినియోగంపై ఎరువుల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, రైతులు యూరియా కొనుగోలులో ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చొరవతో పెద్దపల్లి జిల్లాలో యూరియా బుకింగ్ యాప్‌ను రబీ పంట కాలంలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించగా వారు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. గత రబీ సీజన్‌లో జిల్లాలో 4 లక్షల 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరపై కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ను పొందాలంటే రైతులు బీపీటీ, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, తెలంగాణ సోనా, వరంగల్-44, 1638, 7715 అనే ఏడు సన్నా వరి రకాలనే సాగు చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచామని, రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులు, డీలర్లను ఆదేశించారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, ఆయిల్ పామ్ సాగు ద్వారా అధిక లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. జూన్ 30 నుంచి రైతు భరోసా ఖరీఫ్ నిధులు విడుదల కానున్నాయని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విశేష పురోగతి సాధించామని, గత రెండున్నర సంవత్సరాల్లో విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేసి రాష్ట్రస్థాయి గుర్తింపు పొందినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, గత ఖరీఫ్ సీజన్‌లో అధికారులు, డీలర్లు, రైతుల సహకారంతో జిల్లాలో యూరియా సమస్య తలెత్తలేదని, అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

గత సంవత్సరం జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగిందని, ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో 26 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా, వారం రోజుల్లో మరో 4 వేల మెట్రిక్ టన్నులు రైల్వే ద్వారా చేరనున్నాయని, అదనంగా ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి మరో 2 వేల మెట్రిక్ టన్నుల సరఫరా అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో యూరియా కొరతకు అవకాశం లేదని, అంతర్గత సరఫరా వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ-పాస్ యంత్రాల ద్వారానే యూరియా విక్రయాలు జరగాలని, మండలాల వారీగా అవసరమైన నిల్వలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించామని, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రతిరోజూ బుకింగ్‌లను పర్యవేక్షించాలని తెలిపారు. రైతులకు అవసరానికి మించి యూరియా అందకుండా, ఎవరూ ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాప్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తిన వెంటనే 8 నుంచి 10 గంటల్లో పరిష్కరించాలని, జిల్లాలో ఆందోళనతో అధిక కొనుగోళ్లు జరగకుండా అధికారులు, డీలర్లు రైతులతో సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. గత సీజన్‌లో అక్రమాలకు పాల్పడిన కొన్ని దుకాణాలపై చర్యలు తీసుకున్నామని, ఈసారి ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా కేవలం యాప్, ఈ-పాస్ విధానంలోనే యూరియా సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, ఎరువుల డీలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>