కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమిర్ (Mohammad Amir) బ్రిటిష్ పౌరసత్వం సాధించి మళ్లీ వార్తల్లో నిలిచారు. బ్రిటన్ పౌరుడిగా మారడంతో ‘ది హండ్రెడ్’ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ తరఫున ఆయన లోకల్ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం పొలిటికల్ కారణాల వల్ల పాక్ ప్లేయర్లపై ఐపీఎల్ నిషేధం ఉంది. కానీ పౌరసత్వం మారడంతో అమిర్‌కు ఐపీఎల్లో రిజిస్టర్ చేసుకునే అర్హత దక్కింది.
ఈ క్రమంలోనే ఆయన ఐపీఎల్ ఎంట్రీపై స్వయంగా స్పందించారు. ఐపీఎల్ ఆడటంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే 2027 పీఎస్ఎల్ సీజన్లో మాత్రం విదేశీ ఆటగాడిగా బరిలోకి దిగుతానని చెప్పారు. గతంలో పాక్ మాజీ ఆల్‌రౌండర్ అజహర్ మహమూద్ కూడా ఇలాగే బ్రిటిష్ పౌరసత్వంతో పంజాబ్, కేకేఆర్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు.
కెరీర్లో 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20లు ఆడిన అమిర్.. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ప్రపంచంలోనే బెస్ట్ లెఫ్టార్మ్ పేసర్లలో ఒకరిగా పేరున్న ఆయనకు లీగ్ క్రికెట్లో మంచి క్రేజ్ ఉంది. మరోవైపు అమిర్‌ను లోకల్ ప్లేయర్‌గా తీసుకోవడంపై బ్రిటన్ విమర్శకులు అభ్యంతరం చెప్పినా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం నిబంధనల ప్రకారమే అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన ఐపీఎల్ పయనంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

