కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ నగర శివారులోని మాధవ నగర్ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) సెల్ఫీ పే చర్చా పెట్టారు. అక్కడ ఆగి సెల్ఫీ వీడియో ద్వారా సమస్యను బహిర్గతం చేశారు. కేంద్రం, రాష్ట్రం 50 శాతం చొప్పున భాగస్వామ్యంతో ఈ పనులు 2014 లో మంజూరు అయినా పదేళ్లు బీఆర్‌ఎస్ పార్టీ పట్టించుకోలేదని విమర్శించారు. తాము ధర్నాలు చేస్తే గులాబీ ప్రభుత్వం పడిపోయే ముందు నిధులు మంజూరు చేస్తే.. కాంగ్రెస్ లో మళ్ళీ నిధులు రాక పనులు ఆగిపోయాయని గుర్తు చేశారు.
తాను స్వయంగా కాంగ్రెస్ మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయిస్తే ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ‘నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి ముగ్గురు ఈ రోడ్డు మీదుగా వెళ్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రజలు అంబులెన్స్ లు, బస్సులు, వాహనాల రాకపోకలకు ఎంత ఇబ్బంది అవుతుందో తెలియదా..?’ అని ప్రశ్నించారు.
కమీషన్లు తీసుకున్నా సరే పనులు తొందరగా చేయించాలని ఎంపీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైవేను నిజామాబాద్ నగరాన్ని కలిపే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం నిజామాబాద్ వాసులు 90 ఏళ్లుగా ఎదురుచూస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. కాగా, ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చూడాలి.

