Mobile Popup Ad
Mobile Popup Ad

గర్భిణి, శిశువు మృతి ఘటన.. ఉన్నతాధికారుల విచారణ!

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం (Gundala PHC) శంభునిగూడెం గ్రామానికి చెందిన కుంజా వనజ(21) ప్రసవం కోసం స్థానిక పీహెచ్‌సీలో చేరి, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు శుక్రవారం నేరుగా శంభునిగూడెం గ్రామానికి చేరుకుని క్షేత్రస్థాయి దర్యాప్తు జరిపారు. గ్రామ పెద్దలతో పాటు, వనజ భర్త సంజీవరావుతో మాట్లాడి ప్రసవ సమయంలో జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. గర్భిణి మృతికి గల కారణాలు, సిబ్బంది నిర్లక్ష్యం, కాన్పు సమయంలో అందించిన సేవలపై క్షుణ్ణంగా విచారించారు.

​ఈ విచారణ సందర్భంగా బాధితుడు సంజీవరావు, అతని అక్క అధికారుల ఎదుట వైద్య సిబ్బంది ప్రవర్తనను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. వనజకు డెలివరీ అయిన తర్వాత తీవ్ర రక్తస్రావం అవుతోందని గుండాల పీహెచ్‌సీ సిబ్బందికి మొరపెట్టుకున్నా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితుడి అక్క ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసవ సమయంలో తాను అక్కడే ఉన్నానని, నర్సులను అడిగినా పట్టించుకోకపోగా, పుట్టిన పాప చనిపోయినప్పటికీ ఆ విషయం తమకు చెప్పకుండా, బతికే ఉందంటూ ఆక్సిజన్ పెట్టి ఇల్లందు ఆసుపత్రికి పంపించారని ఆరోపించారు. కనీసం పుట్టిన బిడ్డ చనిపోయిందనే నిజాన్ని కూడా దాచిపెట్టారని వాపోయారు.

​గుండాల పీహెచ్‌సీలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సే డెలివరీ చేసిందని, తీవ్ర నిర్లక్ష్యంతో ఆపరేషన్ చేసి కుట్లు వేయకుండా కత్తెరను కడుపులోనే మరిచిపోయి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారని భర్త సంజీవరావు అధికారుల ఎదుట ఆరోపించారు. తనకు తల్లిదండ్రులు లేరని, ఇప్పుడు వైద్యుల నిర్లక్ష్యం వల్ల భార్య, బిడ్డ కూడా దూరమై ఒంటరివాడినయ్యానంటూ ఆయన రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. కాగా, బాధితుల ఆరోపణలను నమోదు చేసుకున్న డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్.. ఘటనపై పూర్తి నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు. ప్రసవ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని శంభునిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి శ్రీమతి కుంజా వనజ మృతి ఘటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ఘటనపై వెంటనే సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, బాధ్యులపై కఠిన చర్యలు ప్రారంభించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>