కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లా కేంద్రంలో ఘోరం జరిగింది. ఒక ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు తన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సుధ అనే 51 సంవత్సరాల మహిళ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు రామడుగు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు సమాచారం. 25 ఏళ్ల క్రితం వివాహం జరిగినప్పటికీ, నెల రోజులకే భర్తతో విభేదాలు రావడంతో ఆమె విడాకులు తీసుకుని ఒంటరిగానే ఉంటోంది.
అయితే మృతురాలు సుధ గత కొంతకాలంగా మతిస్థిమితం లేక బాధపడుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో చికిత్స కూడా తీసుకుని రెండు రోజుల క్రితమే తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లోని గ్యాస్ స్టవ్ చిమ్నీ, మొబైల్ ఫోన్ కూడా పగిలిపోయి ఉన్నాయి. కాగా, శుక్రవారం నాడు తండ్రి చూస్తుండగానే ఆమె గొడ్డలితో తన తలపైనే బాదుకుని తీవ్రంగా గాయపడిందని, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బంధువుల కథనం ప్రకారం మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఆమె ఇలా చేసుకుందని అంటున్నప్పటికీ త్రీ టౌన్ సిఐ తిరుమల్ ఆధ్వర్యంలో పోలీసులు మాత్రం హత్యా కోణాన్ని కూడా తోసిపుచ్చడం లేదు. అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు.

