విద్యతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విద్యార్థులు విద్యతో పాటు నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) సూచించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

పాఠశాలలో నెలకొల్పిన క్రమశిక్షణ, పరిశుభ్రత, విద్యా సంస్కృతి, విద్యార్థుల్లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం తనను ఎంతో ఆకట్టుకున్నాయని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరుస్తూ ఆత్మవిశ్వాసంతో పాల్గొనడం వెనుక ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని ప్రశంసించారు.

పీఎం శ్రీ పథకం ద్వారా పాఠశాలల్లో ఆధునిక మౌలిక వసతులు, క్రీడా సదుపాయాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, స్మార్ట్ తరగతి గదులు, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోందని, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టింకరింగ్ ల్యాబ్‌లు, వృత్తి విద్యా ప్రయోగశాలలు, ఇన్నోవేషన్ సెంటర్లు విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంలో కీలకంగా ఉంటాయని చెప్పారు.

విద్యార్థులు భవిష్యత్తులో ఇంజనీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు, అధికారులు, కళాకారులుగా రాణించాలని ఆకాంక్షించిన కలెక్టర్, పాఠ్యాంశాలతో పాటు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఏ రంగాన్ని ఎంచుకున్నా ప్రాథమిక పరిజ్ఞానం, నైపుణ్యాలు విజయానికి బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. స్కిల్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, వృత్తి విద్యా ప్రయోగశాలలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు వై. సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>