కలం, జోగుళాంబ గద్వాల: పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందుతున్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద చేపల విక్రయాల మాటున అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయాల్సిన జూరాల ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు అక్రమ మద్యానికి అడ్డాగా మార్చేస్తుంటే వనపర్తి, గద్వాల జిల్లా ఎక్సైజ్, సివిల్ పోలీసులు తమకేమి పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో మద్యం మత్తులో జూరాల ఎడమ కాలువలో పడి మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. అయినా కూడా అధికారులు పర్యాటక ప్రాంతంలో మద్యం నిషేధం చేయడం లేదన్న అరోపణలు వినిపిస్తున్నాయి.
అమరచింత మండలం జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ, ధరూర్ మండలం జూరాల ప్రాజెక్టు సమీపంలో చేపల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. చేపల విక్రయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడిసెల వద్ద ఘుమఘుమ లాడే వంటకాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ఇదే క్రమంలో చేపల ప్రై, మసాల కర్రీ, పులుసు ఆరగించడానికి వచ్చే భోజన ప్రియులకు ప్రత్యేకంగా మందు విక్రయాలు, అక్కడే సిట్టింగ్ లు ఏర్పాటు చేశారు.
చేపల విక్రయాలు జరిగే దుకాణాల వద్దే బహిరంగంగా మద్యం సీసాలు విక్రయిస్తున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో కళ్లముందే కనిపిస్తున్నా.. “మా దృష్టికి రాలేదు” అని ఎక్సైజ్ అధికారులు చెప్పడం సిగ్గుచేటని పలువురు ఆరోపిస్తున్నారు. సంవత్సరాలుగా ఈ దందా బహిరంగంగా సాగుతుంటే అధికారులకు కనిపించకపోవడం వెనుక పెద్ద ఎత్తున ‘మామూళ్ల రాజకీయం’ నడుస్తోందనేది బహిరంగ రహస్యం అని అంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను నడిరోడ్డుపై బొందపెడుతున్నా ఎక్సైజ్ శాఖ నోరు మెదపకపోవడం వెనుక అంతర్యం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపుతుంటే, జూరాల వద్ద మాత్రం అధికారుల అండదండలతోనే ఈ అక్రమ సామ్రాజ్యం వికసిస్తోందని, పర్యాటకులు, మహిళలు, కుటుంబ సమేతంగా వచ్చే ప్రజలు ఈ తాగుబోతుల చేష్టల వల్ల తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూరాల ప్రాజెక్టు పరిసరాల్లోని అక్రమ మద్యం అమ్మకం నిషేధించాలని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు అధికారులను కోరుతున్నారు.

