కలం, ఖమ్మం బ్యూరో : నల్లటి కాగితాలను ప్రత్యేక కెమికల్లో ముంచితే చెలామణి అయ్యే రూ.500 కరెన్సీ నోట్లుగా మారిపోతాయంటూ మాయమాటలు చెప్పి ఒక అమాయకుడి నుంచి రూ.13 లక్షలు కాజేసిన ఘరానా కేటుగాడి గుట్టును అశ్వారావుపేట (Aswaraopeta) పోలీసులు రట్టు చేశారు. నిందితుడి నుంచి రూ.500 నోట్ల సైజులో ఉన్న 20 వేల బ్లాక్ పేపర్లు, మోసానికి వాడిన కెమికల్ సీసాలను స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన మధుబాబు అనే వ్యక్తికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నిందితుడు ప్రత్తిపాటి ప్రేమ్ చంద్ ఆశచూపాడు. తన దగ్గర ఉన్న నల్లటి కాగితాలను కెమికల్లో కడిగితే ఒరిజినల్ రూ.500 నోట్లుగా మారతాయని నమ్మబలికాడు. నిందితుడి మాటలు నిజమేనని భావించిన మధుబాబు, మొదట నల్లటి పేపర్ల కట్టల కోసం రూ.11 లక్షలు అప్పగించాడు. ఆ తర్వాత వాటిని కరెన్సీగా మార్చడానికి వాడే కెమికల్ కోసం మరో రూ.2 లక్షలు ఇచ్చాడు. ఇలా మొత్తంగా రూ.13 లక్షలు కాజేసిన ప్రేమ్ చంద్, ఆ తర్వాత పరారయ్యాడు.
బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన అశ్వారావుపేట సీఐ పింగళి నాగరాజు, ఎస్సైలు యాయాతి రాజు, దేవ్ సింగ్‌ల బృందం గాలింపు చేపట్టి నిందితుడు ప్రేమ్ చంద్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణలో నిందితుడు ఘరానా పాత నేరస్థుడని, గతంలో నకిలీ కరెన్సీ, మోటార్ సైకిళ్ల దొంగతనాలకు సంబంధించి బాచుపల్లి, రామచంద్రాపురం, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో జైలుకు కూడా వెళ్లొచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని, బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని చెప్పే మోసగాళ్ల మాటలను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల్లో ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు, డయల్ 100కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

