ప్రజా సమస్యలపై కేంద్రం చర్చించాలి.. ఢిల్లీలో ఎంపీ చామల

కలం, భువనగిరి: పార్లమెంట్ సమావేశాల్లో దేశానికి, ప్రజల సమస్యలకు సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర చర్చ నిర్వహించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar) కోరారు. ఆదివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురావద్దని, దీనిపై ముందుగా పార్లమెంట్‌లో విస్తృతంగా చర్చ జరగాలని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి..

పార్లమెంట్‌లో పలు అంశాలపై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని ఎంపీ డిమాండ్ చేశారు. అయోధ్యలో ప్రజల నుంచి వచ్చిన విరాళాల వినియోగంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని కోరారు. అలాగే లడఖ్‌కు సంబంధించిన డిమాండ్లపై ఉద్యమిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కిరణ్ రిజిజు సభలో మాట్లాడాలి..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, “వన్ నేషన్–వన్ ఎలక్షన్” ప్రతిపాదన, పెట్రోల్‌లో ఇథనాల్ వినియోగం వంటి అంశాలపై కూడా పార్లమెంట్‌లో సమగ్ర చర్చ నిర్వహించాలని కోరారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును ఈ అంశాలపై చర్చకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగ విలువలను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించిన ఆయన, విదేశీ పర్యటనల కంటే దేశ ప్రజల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు.

తెలంగాణ పెండింగ్ హామీలు అమలు చేయాలి..

అలాగే, చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ మద్దతుతోనే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రాంతీయ అవసరాల దృష్ట్యా రీజినల్ రింగ్ రోడ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇవ్వాలని అన్నారు. విభజన హామీలో భాగమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మెట్రో రెండో దశకు ఆమోదం ఇవ్వాలి..

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు తక్షణ ఆమోదం ఇవ్వాలని, ఈ విషయంలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ కృషి చేయాలని సూచించారు. అలాగే మూసీ నది సుందరీకరణ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్, తెలంగాణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు వంటి అంశాలు కూడా విభజన హామీల్లో భాగమేనని, వాటిని అమలు చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>