కలం, భువనగిరి: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ప్రజా పాలన’ వెయ్యి రోజుల పాలనపై బిఆర్ఎస్ పార్టీ చేస్తోన్న అసత్య ప్రచారాలను కాంగ్రెస్ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికార దుర్వినియోగం చేశారని, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా అదే తరహాలో ఆ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
వెయ్యి రోజులుగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కనీసం ఒక్కరోజు కూడా అసెంబ్లీ చర్చల్లో పాల్గొనకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక తానే పీఠాన్ని అధిష్టించిన కేసీఆర్, ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీలోని ఒక దళిత ఎమ్మెల్యేకు ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుడికి ఆ పదవి ఇస్తేనే కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై మాట్లాడే నైతిక అర్హత బిఆర్ఎస్‌కు ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజా సమస్యల పరిష్కారాన్ని విస్మరించి, కేవలం ఆస్పత్రుల్లో పరామర్శలకు మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.
2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలను అధ్యయనం చేసి, కేసీఆర్ తన పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను తీవ్ర అప్పుల పాలు చేశారని ఆరోపించారు. గత వెయ్యి రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన ప్రతిపక్షం ఎటువంటి సానుకూల భాగస్వామ్యం వహించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, ప్రజా పాలన విజయాలను కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. కేసీఆర్ తక్షణమే ప్రధాన ప్రతిపక్ష నేత పదవి నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ శ్రేణులంతా గళం విప్పాలని ఎంపీ చామల పిలుపునిచ్చారు.

