Mobile Popup Ad
Mobile Popup Ad

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ మహాలక్

కలం, భువనగిరి: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నగరంలో నిర్వహించిన ‘ఆసియా-పసిఫిక్ పార్లమెంటరీ ఫోరమ్’ సదస్సులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఈ సదస్సులో భాగంగా ఏర్పాటుచేసిన “ఆసియా-పసిఫిక్‌లో లింగ సమానత్వ పాలన” అనే ప్రధాన అంశంపై అంతర్జాతీయ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో భారతదేశంలో మహిళా సాధికారత, రక్షణ కోసం అమలవుతున్న వివిధ చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రస్తావించారు. దేశంలో గ్రామీణ మహిళల ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతున్న అంగన్‌వాడీ సేవలు, పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్లు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి కీలక విజయాలను ఎంపీ వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారత కోసం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని సగర్వంగా ప్రకటించారు. రాష్ట్రంలో మహిళలకు అందిస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం, మహిళా స్వయం సంఘాల బలోపేతానికి చర్యలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్ల విధానాన్ని వివరించారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత దేశాలు మహిళల సంరక్షణ సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని, రాజకీయాల్లో మహిళల నాయకత్వానికి మరింత ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా జెండర్-రెస్పాన్సివ్ బడ్జెటింగ్ (మహిళల కేంద్రంగా బడ్జెట్ కేటాయింపులు) ద్వారానే వారి ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

మహిళల సాధికారత అనేది కేవలం సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని.. బలమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి, సమ్మిళిత పాలనకు, స్థిరమైన ఆర్థికాభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ఆసియా-పసిఫిక్ ప్రాంత పార్లమెంటేరియన్లు మహిళల సమాన హక్కులు, సమగ్ర అభివృద్ధి కోసం తీసుకున్న సంకల్పాలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావాలన్నారు. తద్వారా సమానత్వంతో కూడిన భవిష్యత్తును నిర్మించాలని ఎంపీ చామల (MP Chamala) పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>