కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాలలో 10 లక్షల ఎకరాలకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) స్పష్టం చేశారు. ఖమ్మం (Khammam) జిల్లాను అన్ని రంగాలలో తెలంగాణలోనే నంబర్‌వన్ జిల్లాగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతి, యంత్రాల ఏర్పాటు తదితర అంశాలను సమీక్షించిన ఆయన, ఆగస్టు 15 నాటికి ఫ్యాక్టరీని ప్రారంభించేలా అన్ని పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే ఆయిల్ పామ్ సాగు 70 లక్షల ఎకరాలకు చేరాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (NMEO-OP) పథకం కింద గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 6.82 లక్షల ఎకరాలలో కొత్తగా ఆయిల్ పామ్ సాగు విస్తరించగా, అందులో 2.44 లక్షల ఎకరాలు తెలంగాణలోనే సాగులోకి రావడం విశేషమని అన్నారు. దీంతో ఆయిల్ పామ్ సాగు విస్తరణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 79,448 మంది రైతులు 2.94 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని వెల్లడించారు. గతంలో రాష్ట్రంలో కేవలం రెండు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ప్రతి జిల్లాలో రైతులకు అందుబాటులో ఉండేలా కొత్త ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల సిద్ధిపేటలో ఒక ఫ్యాక్టరీ ప్రారంభమైందని, కల్లూరుగూడెం ఫ్యాక్టరీ కూడా తుది దశకు చేరుకుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.12 వేలుగా ఉండేదని, ప్రస్తుతం దానిని రూ.23,852కు పెంచగలిగామని మంత్రి వివరించారు. దీంతో ఆయిల్ పామ్ రైతులకు గణనీయమైన లాభం చేకూరుతోందని అన్నారు.
సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసంతో ఖమ్మం జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే అవకాశం లభించిందని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బుగ్గపాడులో ఏర్పాటు కానున్న పరిశ్రమతో పాటు మరో రెండు మూడు నెలలలో మరికొన్ని పరిశ్రమలు కూడా రానున్నాయని, వాటి ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీపీ వసుంధర యాదవ్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

